టీడీపీతో పొత్తు.. జనసైనికులకు పవన్ వార్నింగ్..!!

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

దీంతో జనసేన కార్యకర్తలు తమ జెండాతో పాటు టీడీపీ జెండాను కూడా మోస్తున్నారు.

అయితే ఏదో సినిమాలో గంగ మెల్లగా చంద్రముఖిగా మారిందన్న చందాన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా చంద్రబాబు బానిసగా మారారంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తోంది.

దీనికి కారణం పవన్ కల్యాణ్ జనసైనికులకు ఇచ్చిన వార్నింగ్ అని చెప్పుకోవచ్చు.టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ టీడీపీతో జనసేన పొత్తును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలతో పాటు నాయకులు కూడా పలు ఉమ్మడి సమావేశాలను సైతం నిర్వహించారు.

అయితే తాజాగా టీడీపీని విమర్శించే కొంతమంది జన సైనికులకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

చంద్రబాబును కానీ, టీడీపీని కానీ ఏమైనా అంటే ఊరుకునేది లేదని సొంత పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారంట.

రాష్ట్రంలో వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని చెబుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ తాను మాత్రం చంద్రబాబు వెంటే ఉంటానని తేల్చి చెప్పారని తెలుస్తోంది.

టీడీపీతో పొత్తు కొనసాగుతుందని ఈ నేపథ్యంలో ఇష్టంలేని వాళ్లు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవచ్చని సూచించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ తాజా హెచ్చరికల నేపథ్యంలో జనసేన పార్టీ క్యాడర్ లో ఆలోచన మొదలైంది.

గత పదేళ్లుగా పని చేస్తున్న పార్టీ క్యాడర్ తో పాటు అభిమానులను చూసే కదా చంద్రబాబు అయినా కేంద్రంలోని మోదీ అయినా పవన్ ను పక్కన కూర్చోబెట్టుకుందని అంటున్నారు.

అలాంటిది కీలకంగా ఉన్న తమనే టీడీపీతో పొత్తు కోసం ఉంటే ఉండండి.పోతే పోండి అంటే తమ పార్టీ అధినేత పవన్ అందరూ చెబుతున్నట్లుగా అమ్ముడు పోయాడా అనే భావన జనసైనికుల్లో చెలరేగిందని తెలుస్తోంది.

ఇన్నేళ్లు పార్టీ కోసం శ్రమిస్తున్నా తమకు కనీసం టికెట్స్ అయినా వస్తాయా? రావా? అనే సందేహం నెలకొందంట.

తెలంగాణలో జనసేనకు బీజేపీ టికెట్లు కేటాయించిన తరహాలో ఇక్కడ జనసేనకు టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయిస్తారా? ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకుని కిమ్మనకుండా ఉండాలా? అనే ప్రశ్న పలువురి మదిలో మెదలాడుతోందని తెలుస్తోంది.

తామంతా పవన్ కోసం ఇంతలా పోరాటం చేస్తుంటే ఆయన వెళ్లి చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధం అవడంపై జనసేన శ్రేణులు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉంటే పార్టీ క్యాడర్ తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు కొన్ని దశాబ్దాల కాలంగా కాపు - కమ్మ సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి.

గతంలో కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఎందరో నేతలు బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అంతేందుకు కాపు నేతగా ఉన్న చేగొండ హరిరామ జోగయ్య సైతం తానూ రాసిన ఓ పుస్తకంలో ఈ అంశాన్ని పేర్కొన్నారు.

అలాగే చంద్రబాబు తనను చంపడానికి ప్రయత్నించారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అలాంటి పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతుండగా ప్రస్తుతం పవన్ కల్యాణ్ వ్యవహారిస్తున్న తీరుపై కాపు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్యాకేజీ కోసమే తమను ఈ విధంగా తాకట్టు పెడుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు.

చంద్రబాబు విదిల్చే సీట్ల కోసం ఇంతలా ఊడిగం చేయాలా? పవన్ సొంతంగా పోటీ చేసి ఆ మాత్రం సీట్లు గెలవలేరా? అనే రుసరసలు వినిపిస్తున్నాయి.

గతంలో టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని ఇప్పుడు పొత్తులు పెట్టుకుని సొంత క్యాడర్ కే హెచ్చరికలు జారీ చేస్తుండటంపై ఏపీ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరో పార్టీ కోసం ఇన్నేళ్లు పని చేసిన సొంత నేతలను, కార్యకర్తలను తక్కువగా చేయడంపై మండిపడుతున్నారు.

పార్టీ శ్రేయస్సు కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పవన్ పొత్తు పెట్టుకున్నారా అనే సందేహం జనసైనికుల మదిలో కూడా మొదలు అయిందని తెలుస్తోంది.

దీంతో మున్ముందు జనసేన పరిస్థితి ఏ విధంగా మారనుందనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదని చెప్పుకోవచ్చు.

ప్రణయగోదారి సినిమా రివ్యూ!