సాగర్ నీటితో జిల్లాలోని అన్ని చెరువులు నింపుతాం

నల్లగొండ జిల్లా: నాగర్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన దృష్ట్యా శనివారం నుండే జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.

నారాయణరెడ్డి తెలిపారు.శనివారం ఆయన జిల్లా ఎస్పీతో కలిసి సాగర్ నీటి వినియోగంపై రెవిన్యూ, పోలీస్,ఇరిగేషన్ శాఖ మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎడమ కాలువ ద్వారా 10 నుండి 11 వేల క్యూసెక్కుల నీటిని వదలడం జరుగుతున్నదని,ఎక్కడైనా చెరువులు,కుంటలు తెగి పోయేందుకు లేదా గండ్లు పడేందుకు ఆస్కారం ఉంటే ముందే గుర్తించి తక్షణమే వాటిని అరికట్టాలన్నారు.

ముఖ్యంగా రైతులెవరూ తొందరపడి సాగునీటిని మళ్లించుకోవద్దని,వారం రోజుల్లో అన్ని చెరువులు నింపుతామన్నారు.గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని చెరువులన్నిటిని ఒకటికి రెండుసార్లు తిరిగి పరిశీలించి,ఎక్కడైనా తెగిపోయేందుకు ఆస్కారం ఉన్న చెరువులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, ఈ విషయాన్ని ముందే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని,నిర్దేశించిన ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లాల్సిన అవసరం ఉందని,ఈ విషయంలో స్థానిక ఇంజనీరింగ్ అధికారులు, అలాగే మండల బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని,లస్కర్లందరూ కాల్వపై అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు.

జిల్లాలో ఏ ఒక్క చెరువు తెగిపోవడానికి వీలులేదని, ఎంపీడీవో,తహసిల్దార్, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్లు సాగర్ నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో ముఖ్యపాత్ర వహించాలని, అదేవిధంగా ఆర్డీవోలు, డిఎస్పీలు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎప్పటికప్పుడు సాగునీటిని పర్యవేక్షణ చేయాలని,సాగునీరు ఎక్కడ దారిమల్లకుండా చూడాలన్నారు.

సంవత్సరం తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా విడుదల చేయడం జరుగుతున్నందు వల్ల రైతులు పంటలు పండించుకునేందుకు ఒక చక్కని అవకాశమని, సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో రైతులతో పాటు, ఇంజనీరింగ్,రెవిన్యూ, పోలీస్ అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు.

అనంతరం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ సాగినీటి సక్రమ నిర్వహణకు గాను పోలీస్ శాఖ తరఫున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని, అంతేకాక బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మండల స్థాయిలో ఎస్ఐలు,ఇతర పోలీసు అధికారులు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా సహకరించాలని ఆదేశించారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎడమ కాలువ నుండి సాగునీటి విడుదలను ప్రతిరోజు పెంచుకుంటూ పోతామని తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర,ఆర్డీవోలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

నీటి కోసం వెళ్లిన సింహానికి మొసలి ఊహించని షాక్.. వీడియో వైరల్..