భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణం పాతబస్టాండ్, వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామంలోని బ్రిడ్జి వద్ద నక్కవాగు వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
సిరిసిల్ల పట్టణం సంజీవయ్య నగర్ కమాన్ వద్ద నిలిచి ఉన్న వరద నీటిని పరిశీలించి, వరద రోడ్డుపైకి రాకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కలెక్టర్ మున్సిపల్ అధికారులను అడిగి ఆరా తీశారు.
వరద నీరు నిల్వకుండా ఏ విధమైన చర్యలు చేపట్టవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామంలో బ్రిడ్జి వద్ద నక్కవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రయాణికులు వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇండ్ల నుండి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు.
లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగుల వరద ప్రవాహాలను అధికారులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని ఆదేశించారు.
వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట రవాణా జరగకుండా బారికేడింగ్ చేయాలని సూచించారు.
క్షేత్ర స్థాయిలో ఆస్తి, పంట నష్టాలు, తదితర వివరాలను యంత్రాంగానికి తెలపడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.
వివరాలను తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ నంబర్ 9398684240 ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
పర్యటనలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ షరీఫ్ మోహియొద్దీన్, ఈఈ ప్రసాద్, తదితరులు ఉన్నారు.
భారతీయుల రక్తంతో తడిసిన ఉక్రెయిన్.. రష్యా తరపున పోరాడుతూ 12 మంది ఇండియన్స్ దుర్మరణం!