దళిత మహిళను వివస్త్రను చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి…!

నల్లగొండ జిల్లా:కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు.

నిడమానూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఒక దళిత మహిళను విచక్షణారహితంగా దాడి చేసి,మానవత్వం మరిచి బహిరంగంగా వివస్త్రను చేసి స్తంభానికి కట్టేయడం దారుణమన్నారు.

సమాజంలో దళితులపైన నేటికి చిన్నచూపు ఉందని, దళిత మహిళ కావటం వల్లనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని, అదే వేరే కులం వారై ఉంటే ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారా అని ప్రశ్నించారు.

దళిత మహిళను వివస్త్ర ను చేసి,స్తంభానికి కట్టేసి,దాడి చేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,కుటుంబన్ని ప్రభుత్వం ఆదుకొని రక్షణ కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దైద శ్రీను,జిల్లా కమిటీసభ్యులు దొంతాల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

నా సంపాదన అంతంత మాత్రమే.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!