పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం పోయింది…!

సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు( Heavy Rains ) రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు రాకపోకలకు ఆటంకంగా మారాయని,వాటిని తాత్కాలికంగా పూడ్చాలని గ్రామస్తులు పలుమార్లు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆ గుంతల్లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.మోతె మండలం( Mothey ) ఉర్లుగొండ- తుమ్మగూడెం ప్రధాన రహదారిలోని నర్సింహపురం గ్రామ శివారులో ఉన్న వంతెన వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి.

దీనితో ఆయా గ్రామాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని,గుంతలు పూడ్చాలని నర్సింహపురం గ్రామ కార్యదర్శి బక్కయ్యకు గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

గ్రామస్తుల ఫిర్యాదును కార్యదర్శి నిర్లక్ష్యం చేశారు.ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నేరేడువాయి గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఊర్లుగొండ నుంచి ఇంటికి వెళ్తుండగా బ్రిడ్జిపైకి రాగానే గుంతలో పడి ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

ఓ నిండు ప్రాణం గాల్లో కలవడానికి గ్రామ కార్యదర్శి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని గ్రామస్థులు మండిపడుతున్నారు.

గతంలో కార్యదర్శి బక్కయ్య పక్క మండలంలో పని చేసిన సమయంలో విధుల్లో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణ చర్య నిమిత్తమై నరసింహాపురం గ్రామానికి బదిలీ చేశారని చెబుతున్నారు.

విధుల్లో అలసత్వం వహించడమే కాకుండా ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

తలస్నానం చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ జుట్టు నల్లగా షైనీ గా మెరిసిపోతుంది!