రాష్ట్రానికి ద్రోహం చేసిన వారితో బంధమా?

ప్రధాని మోదీతో మా బంధం రాజకీయాలకు అతీతం అన్నారు విశాఖ బహిరంగ సభ లో సియం జగన్ రెడ్డి.

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ఎజెండా లేదని కూడా అన్నారు.మరి రాష్ట్రానికి అన్ని విధాలా ద్రోహం చేసిన ప్రధాని మోదీ తో అంత బంధం ఏమిటోవారే చెప్పాలి? రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మరో ఎజెండా లేనప్పుడు మరి విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి, ప్రజలకి సంక్రమించిన హక్కులలో ఏ ఒక్కదానిని నిజాయితీగా కేంద్రం అమలు చెయ్యకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కాపాడారు ముఖ్యమంత్రి? రాష్ట్రానికి కేంద్రం దయదలిచి ఇచ్చిన వరాలు కావు ఇవి.

ప్రత్యేక హోదా,పోలవరం, రైల్వే జోన్‌ విషయంలో కేంద్రం ఎంత నాటకం ఆడుతున్నా చూస్తూ వున్నారు తప్ప ఎన్నడన్నానోరు మెదిపారా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహం వర్ణించలేనిది.

అయినా మా బంధం మోదీ తోనే అనడం అంటే మీకు రాష్ట్ర ప్రయోజనాలు కన్నా మీ స్వార్ధ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయి.

కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం అనడం తప్ప మూడున్నరేళ్లుగా విభజన చట్టం హామీలు అమలు చెయ్యమని ఒక్కసారి అన్నా గట్టిగా మోడీని నిగ్గదీసారా? కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ప్రశ్నించే, ఎదిరించే ధైర్యం లేక మూడున్నరేళ్లు గా కేంద్రానికి మోకరిల్లుతూ ఇంకా రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అనడం ఎవర్ని మోసం చెయ్యడానికి?రాష్ట్రానికి చట్ట ప్రకారం హక్కుగా రావలసిన వాటికి ఎగనామం పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రజలు పట్టుబట్టి పోరాడి సాధించుకున్న విలువైన సంపద అయిన గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను అదానీకి అప్పగించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను పూర్తిగా అమ్మేస్తూ ఉత్తరాంధ్రాకి కేంద్రం ద్రోహం చేస్తున్నా జగన్ రెడ్డిది ప్రేక్షక పాత్రే.

మోదీ తో తన బంధం రాజకీయాలకు అతీతం అని చెప్పడం ద్వారా జగన్ కి తన పై వున్నఅవినీతి కేసుల నుండి ఉపశమనం కలుగుతుందేమో కానీ నష్ట పొయ్యేది మాత్రం రాష్ట్రం,ప్రజలే అని గుర్తించాలి.

విభజన చట్టం హామీల పై ఏనాడు మాట్లాడలేని,పోరాడలేని,రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అని ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు.

రాష్ట్రానికి ద్రోహం చేసిన ద్రోహితో జతకట్టి జనహితం లేని జగన్నాటకం ఆడుతున్నారు.రాష్ట్ర సమస్యల పై ప్రధానికి వివరించడానికి వినతి పత్రాలు లు పట్టుకొని ఢిల్లీ వెళుతున్నట్లు గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి రావాల్సిన వాటిని విశాఖ బహిరంగ సభ వేదికగా ప్రజల సమక్షంలో ప్రధానికి ఎందుకు వివరించలేదు.

అర్ధం అవుతుందా మోదీ సార్ అన్నారు జగన్.తెలుగులో మాట్లాడితే ప్రధానికి ఏమి అర్ధం అవుతుంది.

వేదికల పై పారిశ్రామిక వేత్తలు వున్నప్పుడు వారికి అర్ధం అయ్యే విదంగా ఇంగ్లీషులో మాట్లాడే జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రధానికి ఏమాత్రం అర్ధంకాని తెలుగు భాషలో మాట్లాడంలో ఆంతర్యం ఏమిటి?రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండా అయినప్పుడు రాష్ట్ర సమస్యలు ప్రధానికి అర్ధం అయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆంధ్రుల హక్కుగా సాధించుకొన్న విశాఖ ఉక్కును ప్రవేటీకరిస్తున్నా వ్యతిరేకించక పోవడం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం ఎలా అవుతుంది.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అయితే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చెయ్యారు.

అన్ని రాష్ట్రాలు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని,ద్రోహాలను అక్కడి ప్రభుత్వాలు నిదీస్తున్నాయి.

"""/"/ జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు.

అట్లాగే ఒక పక్కన తెలుగు ప్రజలకు ద్రోహం చేసి మరో పక్కన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజల ప్రతిభను, తెగువను ఆకాశానికెత్తడం విడ్డురంగా వుంది.

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా కొత్త కాదు.గతం లో నూతన రాజధాని అమరావతికి ప్రధాని చేసిన శంకుస్థాపనకు విలువ లేకుండా చేశారు.

అమరావతికి వేసిన పునాది రాయిని సమాదిరాయిని చెయ్యడమే ప్రత్యక్ష ఉదాహరణ.రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసి, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీకి విలువ లేకుండా పోయింది.ఒక పక్కన విశాఖ అభివృద్ధికి తలమానికంగా వున్న స్టీల్‌ ప్లాంట్ ని అమ్మేస్తూ విశాఖ సమ్మిళిత వృద్ధి అంటే ప్రజలెలా నమ్ముతారు ప్రధాని గారు? విశాఖను ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపార కేంద్రంగా మారుస్తామన్నారు ఎవరిని మభ్యపెట్టడానికి? వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ఇస్తామన్న నిధులకు అతి,గతి లేదు కాని, విశాఖను అతిపెద్ద వ్యాపార కేంద్రంగా మారుస్తామంటూ ప్రధాని బులిపించడం హాస్యాస్పదంగా వుంది.

విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా రాష్ట్రానికి అన్ని విధాలా ద్రోహం చేసిన ప్రధాని మోదీ తో మా బంధం రాజకీయాలకు అతీతం అని జగన్మోహన్ రెడ్డి అనడం అంటే అంత బంధం ఏమిటో? ఆయనే సమాధానం చెప్పాలి.

చేసిన సినిమా ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాను క్యాన్సల్ చేసిన హీరోలు ..!