3 కోట్ల 15 లక్షల రూపాయల నిధులు బూడిదపాలు
TeluguStop.com
నల్లగొండ జిల్లా:రూ.10 లక్షలు పెట్టి ఇల్లు కడితేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, నాణ్యమైన సిమెంటు, ఇసుక తెప్పిచ్చి దగ్గరుండి మరి నిర్మాణం చేయించుకుంటాం.
ఎందుకంటే నిర్మాణం పది కాలాల పాటు నిలిచి ఉండాలని,పెట్టే ప్రతి పైసా మన కష్టార్జితం కాబట్టి.
కానీ,మన అధికారులు, సర్కార్ మాత్రం కోట్లకు కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి రోడ్లు నిర్మించాలంటూ చేతులు దులిపివేసుకుంది.
ఈ క్షణం కోసమే కూర్చున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిగా పనులు చేస్తున్నాడు.గిరిజన సంక్షేమ శాఖ 3 కోట్ల 15 లక్షల రూపాయల నిధులు బూడిదపాలు అవుతున్నాయి.
తూతూ మంత్రంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు.సంబంధిత అధికారులు మాత్రం అటు కన్నెత్తి కూడా చూడడం లేదు.
రోడ్డు వేసామా నిధులు ఎత్తామా నన్ను అడిగేది ఎవరు.? అనే రీతిలో సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలోని జగ్గుతండా గ్రామం నుండి తక్కెలపాడు గ్రామ పరిధిలోని సామ్యతండా మీదుగా వేములపల్లి మండలంలోని భీమవరం మిర్యాలగూడ ఆర్&బి రోడ్డు వరకు గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుండి 3 కోట్ల 15 లక్షల రూపాయల వ్యయంతో 3.
5 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న నూతన బీటీ రోడ్డు పనులకు అప్పట్లో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇప్పుడు తూతూ మంత్రంగా విచ్చలవిడిగా వేస్తున్నారు.
కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో జరుగుతున్న రోడ్డు పనులు నాసిరకంగా ఉన్నాయి.గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిన కారణంగా ఇక్కడ నిర్మించిన రోడ్డు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలబడింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెటీరియల్‌ను ఉపయోగించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.మరో పక్క ఇంజనీర్లు చూపిన రూట్ మ్యాప్ ప్రకారంగా కాకుండా గుత్తేదారులు తమకు ఇష్టం వచ్చినట్లు ఎల్15 లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వ పై నుండి నిర్మించడమే కాకుండా వేయాల్సిన వెడల్పు కంటే వెడల్పు తక్కువగా వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఉన్న చప్టాను పటిష్టంగా చేసి ఆపైన రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది.ఇక్కడ ఏ రోజుకు ఆరోజు అన్నట్లుగా భవిష్యత్ భద్రాన్ని పాటించకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా తెలుస్తుంది.
ఇంకో పక్క నిర్మించే సిమెంట్ రోడ్డయినా పటిష్టంగా నిర్మిస్తున్నారా అంటే అదీ జరుగడం లేదని,నాసిరకం మెటీరియల్‌ను,డస్ట్‌ను,ఐరన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది.
నిర్మాణం జరుగుత్ను రోడ్డు పనుల సమయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణే లేకుండా పోయింది.
దీంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు.దానిని కప్పిపుచ్చేందుకు ఆ వెను వెంటనే పైన రోడ్డు వేస్తున్నారు.
ప్రాథమికంగా రోడ్డు బాటమ్ బెడ్ (40ఎంఎం) పెద్ద కంకరు రాళ్లు,సిమెంట్ బాగా వేసిన తర్వాత బాగా వైబ్రేషన్‌చేసి రెండు రోజుల పాటు బాగా క్యూరింగ్ చేయాల్సి ఉంది.
అయితే ఆ పద్ధతిని ఎక్కడా పాటించడం లేదు.దీన్నిబట్టి గుత్తేదారులు, సంబంధిత అధికారులు కుమ్మక్కై నాసిరకంగా రోడ్డు నిర్మాణ పనులు నిర్మిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా సంబందిత ఉన్నంత అధికారులు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదే విషయంపై సంబంధిత అధికారి ఏఈ పోతరాజు నవీన్ ను వివరణ కోరుతూ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ఇవ్వమని అడిగితే డిఈఈని అడిగి తీసుకోండి అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతూ వాళ్ల పని వాళ్లు సక్రమంగానే చేసుకుంటారు.
ఇందులో తల దూర్చడం మీకేంటి? అని దురుసుగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
మోకాళ్ళ నొప్పులను తరిమికొట్టే సూపర్ లడ్డూ ఇది.. రోజూ తింటే లాభాలే లాభాలు!