జిల్లా వ్యాప్తంగా 25 తండాలు గ్రామ పంచాయితీలుగా రూపాంతరం చెందాయి – జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చడంతోనే స్వయం పరిపాలన సాధ్యమయిందని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.

సత్య ప్రసాద్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తెలంగాణ గిరిజనోత్సవాన్ని పురస్కరించుకుని వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత పదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని అందరికీ తెలిపే విధంగా రోజుకో కార్యక్రమంతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

జిల్లాలో 25 తండాలను గ్రామ పంచాయితీలుగా మార్పు చెందాయని, దీని ద్వారా గిరిజన ప్రజలకు స్వయం పరిపాలన సాధ్యమైందని అన్నారు.

స్థానికంగా ఉన్న వారు గ్రామాలను పాలిస్తేనే సమస్యల మీద అవగాహన ఉంటుందని గమనించి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తండాలను గ్రామ పంచాయితీలుగా మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

తండాలు గ్రామ పంచాయితీలుగా మారిన తర్వాత గ్రామాల్లో అనేక మార్పులు వచ్చాయని, రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్ లు, నర్సరీలు, గ్రామ పంచాయితీ భవనాలు తదితర అభివృద్ధి పనులను చేసుకున్నామని అన్నారు.

ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుందని, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు.

హైదరాబాద్ లో గిరిజనుల కోసం సేవాలాల్ భవన్, ఆదివాసి భవన్, ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జెడ్పిటిసి గుగులోతు కళావతి, ఎంపీడీవో నరేష్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, సర్పంచ్ జగ్మాల్ నాయక్, డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు డబ్బులిస్తా కానీ బ్లాక్ మెయిల్ చేసేవాళ్లకు కాదు.. హర్షసాయి సంచలన వ్యాఖ్యలు!