రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి: సీపీఎం

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి రైతులను ఆదుకొని ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, సిపిఎం మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ శనివారం నల్లగొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రంలో ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రుణమాఫీ పేరిట కాలయాపన సరైంది కాదని,ఎన్నికల సందర్భంగా రైతులకు రుణాలు ఎవరు చెల్లించవద్దని,ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు.

ఇంతవరకు రుణమాఫీఫై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు గ్రామాలలో రైతులను రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని తెలిపారు.

గ్రామాలలో రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని,సహకార సంఘాలలో రైతులు తీసుకున్న అప్పులు చెల్లించాలని,వడ్డీలు వసూలు చేసి సిబ్బంది జీతాలు తీసుకోవాలని జిల్లా బ్యాంక్ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో మండలాల్లో కిందిస్థాయి సిబ్బంది గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

ప్రభుత్వమేమో ఒకపక్క ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ, బ్యాంక్ అధికారులు రైతులను ఒత్తిడి చేయడం చూస్తుంటే దూడను పాలు తాగమని బర్రెను తన్నమని చెప్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాంక్ అధికారులను కట్టడి చేస్తూ,రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేసి రైతులను ఆదుకోవాలని, లేకుంటే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ చిన్నారి ఆధార్ కార్డు ఫోటో కోసం ఎంత ముద్దుగా ఫోజులిస్తుందో..