వయసు 17, ఏనుగులను రక్షించేందుకు ప్రత్యేక పరికరం... ఎన్ఆర్ఐ బాలికపై ప్రశంసలు

భారతీయ పురాతన ఇతిహాసాలతో పాటు ఎన్నో దేశాల జానపద కథల్లో ఏనుగుల గురించి ప్రస్తావన వున్న సంగతి తెలిసిందే.

వూళ్లోకి ఏనుగులు వస్తే పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు.కానీ నేడు ఏనుగుల మనుగడ ప్రమాదంలో పడింది.

వాటి దంతాలు, చర్మం, మాంసం కోసం ఏనుగులను విచక్షణారహితంగా చంపేస్తున్నారు.ఈ క్రమంలో ఏనుగుల సంతతిని రక్షించేందుకు గాను ఆగస్ట్ 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

వేటగాళ్లు, స్మగ్లర్ల బారినపడుతుండటంతో పాటు అడవులను దాటి జనావాసాల్లోకి వెళ్తుండటంతో ప్రజలు కొట్టి చంపేస్తున్నారు.

పర్యావరణాన్ని దృష్టిలో వుంచుకుని అనేక దేశాలు ఇప్పుడు ఏనుగులను సంరక్షించే బాధ్యతను చేపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల బాలిక ఏనుగులను వేటగాళ్ల బారినుంచి రక్షించేందుకు నడుం బిగించింది.

దీనిలో భాగంగా వేటగాళ్లను ట్రాక్ చేసే పరికరాన్ని కనిపెట్టింది.ఆమె పేరు అనికా పూరి.

ఈమె ఆవిష్కరించిన పరికరం పేరు ‘‘ EISa ’’.ఇది మెషీన్ లెర్నింగ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ద్వారా పనిచేస్తుంది.

ఇది వీడియోలలో మనుషులు, ఏనుగుల నమూనాలను గమనించి విశ్లేషించగలదు.థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ వీడియోల ద్వారా కదలికలను విశ్లేషిస్తున్నందున వేటగాళ్లను గుర్తించడంలో డ్రోన్‌ల కంటే తన పరికరం నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా వుంటుందని అనికా అన్నారు.

దీని ధర 250 అమెరికన్ డాలర్లు.దీనిలో FLIR ONE Pro థర్మల్ కెమెరాను ఉపయోగించడం వల్ల కదలికలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు.

"""/"/ ఈ సందర్భంగా అనికా మాట్లాడుతూ.నాలుగేళ్ల క్రితం తాను భారతదేశాన్ని సందర్శించినప్పుడు ముంబైలో ఏనుగు దంతాలతో చేసిన నగలు, విగ్రహాల వరుసలతో నిండిన మార్కెట్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది.

వేటాడటం చట్టవిరుద్ధమని, మరి ఇది ఇంత పెద్ద సమస్యగా ఎలా మారిందని తన మనసులో ఆలోచన మొదలైనట్లు అనికా చెప్పింది.

ఆమె చెప్పినట్లుగానే 1970లలోనే మనదేశంలో ఏనుగుల వేటను నిషేధించారు.అలాగే ఏనుగు దంతాల వ్యాపారాన్ని కూడా దాదాపు అన్ని దేశాలు నిషేధించాయి.

కానీ వీటిని స్మగ్లర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ఈ క్రమంలోనే అనికా ఎంతో కష్టపడి ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది.

ఐఫోన్‌కు జోడించి దీనిని ఉపయోగించవచ్చు.డ్రోన్‌కు EISa కెమెరాను పెట్టి అడవుల్లో ఎగురవేసి ఏనుగులు, మానవుల కదలికలను గుర్తించవచ్చని అనికా తెలిపింది.