అధిక లోడ్ తో ఆగమవుతున్న 167 హైవే…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం అప్పన్నపేట శివారు చుట్టూరా పచ్చటిపొలాలు, సహజవనరులు,ఫ్యాక్టరీలు ఉన్నాయి.
పక్కనే ఉన్న 167 హైవే( National Highway 167 ) పై నిత్యం జనరల్ వాహనాలతో పాటు నాపరాయి,కంకర రవాణా చేసే టిప్పర్లు, లారీల వంటి భారీ వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి.
అప్పన్నపేట( Appannapeta ) శివారులో ఉన్న సుమారు 7 కంకర మిల్లుల నుండే అధిక మొత్తంలో కంకర సరఫరా అవుతుంది.
ఇటీవలే నూతనంగా నిర్మించిన 167 హైవేకి 500 మీటర్ల దూరం కంకర మిల్లులు ఉండాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి హైవే పక్కనే స్టోన్ క్రషర్ మిషన్స్( Stone Crushers ) ఏర్పాటుచేసి, నిబంధనల ప్రకారం ట్రక్కుల్లో 27 టన్నుల వరకు రవాణా చేయాల్సి ఉండగా,వందలాది టిప్పర్లు,ట్రక్కులతో సామర్ధ్యానికి మించి 35 టన్నుల వరకు ఓవర్ లోడ్ తో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు,ఇతర జిల్లాలకు,రాష్ట్రాలకు కూడా కంకర సరఫరా చేస్తున్నారు.
సామర్థ్యానికి మించి లోడింగ్ వాహనాలు వెళ్తుంటే దుమ్ము,ధూళితో హైవే మొత్తం కమ్మేస్తుంది.దీనితో లారీలో వెనుక వెళ్లే వాహనదారులు నిరంతరం ఇబ్బందులు తప్పడంలేదు.
సాధారణ రవాణా కోసం వేసిన రోడ్లు భారీ వాహనాలతో ధ్వంసమవుతున్నాయి.అయినా వీరికి ప్రయాణికుల కష్టాలు పట్టవు,ప్రభుత్వ నిబంధనలు పాటించరు, అప్పన్నపేట స్టోన్ క్రషర్ మిల్లర్ల ఇష్టారాజ్యంతో చేస్తున్న వ్యాపారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
స్థానికులు అధిక లోడ్ లారీలపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు కళ్ళు తెరిచి హైవేపై ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలపై నిఘా పెంచి, నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మొటిమల నుంచి పొడి చర్మం వరకు కలబందతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?