రోడ్డు వెడల్పు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:నల్లగొండ పట్టణంలో రోడ్డు వెడల్పులో ఇండ్లు,దుకాణాలు కోల్పోతున్న వారికి భూ నిర్వాసితుల చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం, ప్రత్యామ్నాయ భూమి,అవకాశాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హషం,నల్లగొండ పట్టణ రోడ్డు వెడల్పు భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ ఎండి.
సలీం డిమాండ్ చేశారు.నల్గొండ పట్టణ రోడ్డు వెడల్పు భూనిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి,కమిషనర్ రమణాచారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల వెడల్పులో భాగంగా నల్లగొండ పట్టణంలో మర్రిగూడ బైపాస్ నుండి వయా గొల్లగూడ,డీఈఓ ఆఫీస్,దుప్పలపెళ్లి రైల్వే బ్రిడ్జి వరకు,పానగల్లు నుండి చేస్తున్న రోడ్డు వెడల్పులలో రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు,ఇండ్లు పేద,మధ్య తరగతి ప్రజలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
1987 నల్గొండ పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రకారం బస్టాండ్ నుండి హైదరాబాద్ రోడ్డు వరకు,డిఓ ఆఫీస్ నుండి పానగల్లు నుండి ఎస్ఎల్బిసి వరకు,80 ఫీట్ల రోడ్డుగా,బస్టాండ్ నుండి పెద్ద బండ సెంటర్ వరకు 50 ఫీట్ ల రోడ్డుగా ఉన్నాయని,80 శాతం మంది దుకాణాలు కిరాయికి తీసుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారే ఉన్నారని తెలిపారు.
ఈ కారణంగా దుకాణ యజమానులు కిరాయి వారిని ఖాళీ చేయించడం వలన పేద,మధ్య తరగతి వారు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు.
మునిసిపల్ టౌన్ ప్లానింగ్ లో 1987 కు ముందు ఉన్న డాక్యుమెంట్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డుగా చూపిస్తున్నదని,ఆ తరువాత ఎప్పుడూ ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్ల విస్తరణ చేపట్టలేదని గుర్తు చేశారు.
నిబంధనల ప్రకారం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇండ్లు,షాపుల ముందు జెసిబిలతో భయాందోళనలు కలిగిస్తున్నారని,ఇది చట్టవిరుద్ధమన్నారు.
ప్రభుత్వం ఆర్ అండ్ బి రూల్స్ ప్రకారం 100 ఫీట్లని తీసుకోవడం ద్వారా వేలాది కుటుంబాలు ఇండ్లు,ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారని తెలిపారు.
నూడా అభివృద్ధిలో భాగంగా రోడ్ వెడల్పు 80 ఫీట్లకు తగ్గించడం ద్వారా నిర్వాసితుల సంఖ్య తగ్గించుకోవచ్చని,రోడ్డు వెడల్పులో ఇండ్లు,దుకాణాలు కోల్పోతున్న వారికి భూ నిర్వశితుల చట్టం 2013 ప్రకారం భూమి,నష్ట పరిహారం,ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నామన్నారు.
పట్టణంలో చేస్తున్న అన్ని రోడ్ల వెడల్పు 80 ఫీట్ లకు కుదించి నిర్వాసితుల సంఖ్య తగ్గించాలని,రోడ్డు వెడల్పులో ఇండ్లు,దుకాణాలు కోల్పోతున్న వారికి భూమికి ప్రత్యామ్నాయ భూమి, భవనాలకు నష్టపరిహారం చెల్లించాలని,రోడ్ల వెంట చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ,రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి,నిర్వాససితుల పోరాట కమిటీ నాయకులు అలుగుబెల్లి వేణుగోపాల్ రెడ్డి, సజ్జాద్ ఖాన్,కావేరి అంజయ్య,బోళ్ల చంద్రమ్మ, మన్నె శంకర్,గాదె నరసింహ,అద్దంకి నరసింహ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.