నల్లగొండ జిల్లా:
ఈ సారి ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే దృష్టి సారించారా?వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గం మారనున్నారా?ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయా?
కేసీఆర్ చూపు ముందుకా వెనక్కా?జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాఫిక్ గా మారింది.
దక్షిణ తెలంగాణలోనూ టీఆర్‌ఎ్‌సను మరింత బలోపేతం చేసేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల శాసనమండలి చైర్మన్‌ను ఖరారు చేసే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి,గుత్తా సుఖేందర్‌రెడ్డితో జిల్లాకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి చర్చించారని పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు మునుగోడు ఎంత దూరంలో ఉంటుందని,మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తే ఎలా ఉంటుందని జిల్లా నేతలను అడిగి తెలుసుకున్నారనే అంశం తెరపైకి వచ్చింది.
హైదరాబాద్ నుంచి మునుగోడు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఆ ఇద్దరు నేతలు సమాధానమివ్వగా,గజ్వేల్ కూడా హైదరాబాద్ నుంచి అంతే దూరం ఉంటుంది కదా!అని సీఎం అన్నట్లు తెలిసింది.
దీంతో మీరు మునుగోడు నుండి పోటీ చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు,దక్షిణ తెలంగాణలో పార్టీకి మంచి జోష్ వస్తుందని,మంచి ఫలితాలు సాధిస్తామంటూ నేతలు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో జిల్లా వ్యాప్తంగా వాడివేడిగా చర్చ మొదలైంది.
వాస్తవానికి కేసీఆర్ యాదాద్రి జిల్లా ఆలేరు నుంచి పోటీ చేస్తారని తొలుత గులాబీ పార్టీలో చర్చించుకున్నప్పటికీ,తాజాగా కేసీఆర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఈ ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు,పక్కనే ఉన్న ఖమ్మం,మహబూబ్‌నగర్ జిల్లాలపై కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉంటే ఇదంతా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగమేనని, చెప్పింది చేయకపోవడం,చేసేది చెప్పకపోవడం కేసీఆర్ నైజమని ఆయనను దగ్గరగా చూసిన వారు మాట్లాడుకోవడం గమనార్హం.
*ప్రస్తుత మునుగోడు పరిస్థితి*
మునుగోడు నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజగోపాల్‌రెడ్డి స్థానికేతరుడైనప్పటికీ కోమటిరెడ్డి కుటుంబానికి ఉన్న క్రేజ్‌తో గత ఎన్నికల్లో ఆయన మునుగోడు నుండి విజయం సాధించారు.
విపక్ష ఎమ్మెల్యేకు నిధుల కేటాయింపులో వివక్ష,భారీ ప్రాజెక్టుల విషయం అలసత్వం లాంటి విషయాలు పక్కనపెడితే,మునుగోడు నియోజకవర్గంలో సాధారణ పనులకే దిక్కు లేకుండా పోయిందనేది ఎమ్మెల్యే కోమటిరెడ్డి అసెంబ్లీలో,బయట ప్రభుత్వ వ్యతిరేక గొంతు వినిపిస్తున్నారు.
కరోనా కారణంగా గత మూడేళ్లుగా రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంతో అంటీముట్టనట్టుగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.
అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారా? బీజేపీ తరఫున బరిలోకి దిగుతారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
దీనికితోడు భువనగిరి ఎంపీగా తిరిగి పోటీచేసే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడినా,ఎంపీగా పోటీ చేసినా మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక్కడ బీజేపీ బలం కూడా అంతంత మాత్రంగానే ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
నిత్యం గుప్పెడు ఉడికించిన పెసలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?