నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం రక్షణకై జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం:భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు
TeluguStop.com
నల్లగొండ జిల్లా:
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల పోరాటాలు, కార్మిక సంఘాలు,వామపక్ష పార్టీల అండతో ఏర్పడిన 1996 నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం,1979 అంతర్రాష్ట్ర వలస కార్మికులు చట్టాల రక్షణకై జరుగుతున్న మార్చి 28 ,29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, టిఆర్ఎస్కెవి నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు అవుటర్ రవీందర్ పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో జరిగిన సిఐటియు, ఏఐటియుసి,ఐఎన్టియుసి,టిఆర్ఎస్కెవి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని,4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గుండుగుత్తగా ప్రజల ఆస్తులను కార్పొరేటులకు అప్పనంగా కట్టబెట్టడం ఆపాలని,భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రక్షించాలని డిమాండ్ చేశారు.
నిర్మాణంలో వాడే ముడిసరుకుల పెరిగే ధరలను అరికట్టి,వాటిపై జీఎస్టీ పన్ను తగ్గించాలని, ఈ శ్రమ్ స్కీమ్ లో భవన నిర్మాణ కార్మికులoదరిని నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిన 1005 కోట్ల రూపాయలు తిరిగి సంక్షేమ బోర్డులో జమ చేయాలని,పెండింగ్లో ఉన్న క్లైమ్ లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 28 ,29 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర బడ్జెట్ లో అసంఘటిత కార్మికులకు సోషల్ సెక్యూరిటీ కల్పించాలని,50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమ్మె జయప్రదం కోసం అడ్డాలలో, పని ప్రదేశాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని,25న మోటార్ సైకిల్ ర్యాలీ,28న పెద్ద గడియారం సెంటర్లో బహిరంగ సభ,29 కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో సిఐటియు,ఏఐటీయూసీ, ఐఎన్టియుసి,టిఆర్ఎస్కెవి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు అద్దంకి నరసింహ,పోలే సత్యనారాయణ,గుండె రవి,శంభు రెడ్డి,ఎనమల వెంకన్న,దేవరపల్లి వెంకట్ రెడ్డి,సాగర్ల మల్లయ్య, వరికుప్పల హనుమంతు,గాదేపాక వీరయ్య,మన్నె శంకర్,లింగయ్య,గోవింద్,అంజయ్య,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.