నిన్న జాతర నేడు స్థానిక సెలవ?

నల్లగొండ జిల్లా:అయిపోయిన పెళ్లికి మంగళవాయిద్యాలు అన్న చందంగా ఉంది నల్లగొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుల వ్యవహార శైలి.

వివరాల్లోకి వెళితే.మర్రిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాజమాన్యం ఈ రోజు బడికి స్థానిక సెలవు ప్రకటించారు.

అందులో ఏముంది ఎవరైనా తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చుకదా అంటారా!అవుననుకోండి కానీ, ఈ స్థానిక సెలవుకు ఓ ప్రత్యేకత ఉన్నది.

అదేంటో తెలిస్తేనే మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరు మీకు ఔరా అనిపిస్తుంది.

నాంపల్లి మండలంలోని తుంగపాడు గౌరారం గ్రామంలో చలిదోన లక్ష్మీనరసింహస్వామి జాతర తేదీ:12-03-2022 నుండి 16-౦03-2022 వరకు జరిగింది.

నిన్నటితో ఆ జాతర బ్రహ్మోత్సవాలు ముగిశాయి.ఆ జాతరకు స్థానిక సెలవు ప్రకటించాల్సిన పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు,సిలబస్ పూర్తి కాలేదన్న సాకుతో సెలవు ఇవ్వలేదు.

కానీ,జాతర అయిపోయిన మరునాడు స్థానిక సెలవును ప్రకటించి పాఠశాలకు తాళం వేయడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ స్థానిక సెలవు ఇవ్వడం వెనుకాల మర్మమేంటో అర్థం కాక విద్యార్దులు ఇళ్లకే పరిమితమయ్యారు.

అసలు ఈ స్థానిక సెలవు పిల్లలకా? లేక ఉపాధ్యాయులకా అని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అసలు సంగతి ఏమిటంటే నిన్న బుధవారం రోజు పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం జరిగింది.

మరుసటి రోజు ఎలాగైనా సెలవు కావాలని భావించిన ఉపాధ్యాయులు అయిపోయిన జాతరని బూచిగా చూపించి సెలవు తీసుకోవడం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కరోనా మహమ్మారి వల్ల దాదాపు రెండు సంవత్సరాలు విద్యా సంవత్సరం నష్టపోయి, చదువుకు దూరమైన విద్యార్థులు ఇప్పుడిప్పుడే విద్యాలయాలకు అలవాటు పడుతున్నారు.

చాలా పాఠశాలల్లో సిలబస్ పూర్తికాకపోవడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరీక్షలను కూడా ముందుకి జరిపిన విషయం మనందరికీ తెలిసిందే.

ఓ పక్క ప్రభుత్వం పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటుంటే,మర్రిగూడ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ నిర్ణయంతో తమకేమీ పని అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు పట్ల స్థానికులు,తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మర్రిగూడ ఉన్నత పాఠశాలలో చైర్మన్, ఉపాధ్యాయులు కలసి విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతుందని అంటున్నారు.

ఇదంతా మండల విద్యా శాఖ అధికారులకు తెలిసే జరిగిందా లేక ఉపాధ్యాయుల సొంత నిర్ణయమా? అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

పిల్లల భవిష్యత్ ను గాలికొదిలేసి ఇష్టానుసారంగా సెలవులు ప్రకటిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోయేనని స్థానికులు వాపోతున్నారు.

అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)