గారకుంట తండా వద్ద సాగర్ కాల్వపై రైతుల ధర్నా

సూర్యాపేట జిల్లా:సాగర్ ఎడమ కాల్వకు(Sagar Left Channel) నీటిని విడిచి వారం రోజులు అవుతున్నా 10 వ,బ్లాక్ లోని ఎల్ -9 పరిధిలోని గానుగబండ, హనుమంతులగూడెం, కొండాయిగుడెం,గంగానగర్ గ్రామాలకు ఇంతవరకు సాగర్ నీరు చేరక పంటలు ఎండిపోతున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా (Suryapet District)గరిడేపల్లి మండలం గారకుంటతండా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఓ పక్క సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారి, కిందికి నీళ్ళు విడుదల చేస్తుంటే మరోవైపు సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని,దీనికి ప్రధాన కారణం గరిడేపల్లి నుండి అలింగాపురం వరకు డబుల్ రోడ్ నిర్మిస్తున్న కాంట్రక్టర్,ఆర్ అండ్ బి అధికారులు గారకుంటతండా వద్ద బ్రిడ్జి నిర్మించకుండా చేసిన నిర్లక్ష్యమేనన్నారు.

గతంలో గూనలతో బ్రిడ్జి వుండటంతో వచ్చే నీటికి గూనల వద్ద చెత్త చెదారం అడ్డుపడి గూనల్లో నీళ్లు పట్టక పొర్లిపోవడంతో ఎన్ఎస్పీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీళ్ళు బంద్ చేశారని, దీనితో కాల్వ చివరి గ్రామాల భూములకు నీళ్ళు అందక నారుమళ్ళు ఎండిపోతున్నాయని వాపోయారు.

ఈ సమస్య పరిష్కారం కోసం సాగర్ కాల్వపై ప్రస్తుతానికి పెద్ద గూనలతో బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖమూదినట్లుగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల కడుపు మండి బ్రిడ్జి కట్టాల్సిన చోట మూడు గంటల పాటు ధర్నా చెసినా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి సాగర్ ఆయకట్టు క్రింది వరకు నీళ్ళు వచ్చేలా సాగర్ కాల్వపై బ్రిడ్జి కానీ, తాత్కాలికంగా గూనలు వేసి నీటి విడుదలకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోకల వెంకటేశ్వర్లు, పాకాల పరమేశ్,కడియాల అప్పయ్య,నంద్యాల అంజిరెడ్డి,కట్టా నరసింహరావు,మంగళపల్లి నాగేంద్రబాబు,ఈదా అంజనేయులు,ఈదా నాగేశ్వరరావు,పోకల నరసింహరావు,కీసర వెంకయ్య,జొన్నలగడ్డ వీరయ్య,పంగ నరసింహరావు మెండే సైదులు,గుర్రం రాంరెడ్డి, కొత్త వెంకటరెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఒక్క దెబ్బతో చుండ్రు పోవాలా.. అయితే ఈ టోనర్ మీకోస‌మే!