యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి పోలీసు స్టేషన్ ముందు కొంతమంది
ఆందోళనకు దిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయామని గుర్తించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి,పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
దీనితో రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళితే అబ్దుల్ షాకిర్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దుబాయ్ లో ఉన్న రెహమాన్ కి హవాలా ద్వారా పంపించాడని తెలుస్తోంది.
షాకిర్ భువనగిరి పట్టణ ప్రజలు మరియు బంధువుల దగ్గర నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నానని నమ్మబలికి అందరి దగ్గర నుండి సుమారు 3 నుంచి 4 వందల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశాడని బాధితుల కథనం.
రెహమాన్ భువనగిరి పట్టణంలోని పహడినగర్ వాసిగా చెబుతున్నారు.అందరికీ అధిక వడ్డీల పేరుతో మోసం చేస్తున్నాడని గ్రహించిన పట్టణ వాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇదిలా ఉంటే
తనకు న్యాయం చేయండని,తన భర్తకు ప్రాణహాని ఉందంటూ షాకీర్ భార్య మీడియా ముందు రోధించడం గమనార్హం.
ఓ బాధితుడు మాట్లాడుతూ నానా కష్టాలు చేసి పైసా పైసా పోగుచేసి సొంతంగా ఇళ్లు,భూములు కొనుక్కోవాలని ఆశతో జమ చేసుకున్న డబ్బులు అతనికి ఇచ్చి మోసపోయామని తెలిపారు.
మోసపోయిన బాధితులలో పురుషులు, మహిళలు కూడా ఉన్నారన్నారు.మోసం చేసిన వారి దగ్గరికి వెళ్లి మా డబ్బులు మాకు ఇవ్వమని అడగగా మీరు ఎవరో నాకు తెలియదంటూ బుకాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ బాండ్ పేపర్ లో రాసి ఇచ్చి,ఇప్పుడు కుటుంబ అవసరాలకు డబ్బులు కావాలని అడగగా మీకు దిక్కున్న చోట చెప్పుకోండి,ఏమైనా చేసుకోండి అంటూ బెదిరిస్తున్నాడని మరికొంత బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపుతానని బెదిరిస్తున్నాడని,అతని నుండి తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు తెలిపారు.
పోలీస్ స్టేషన్లో బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో వారిని కంట్రోల్ చేయడం ఒకదశలో ఇబ్బందిగా మారింది.
తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉండడంతో పూర్తి విచారణ చేసి నిజాలను నిగ్గు తెలుస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.