కారు కి డేంజర్ సిగ్నల్ సగం మంది సీట్లు డౌటేనట   Telangana TRS Party In Danger     2018-07-16   13:04:19  IST  Sainath G

కారుని పరుగులు పెట్టించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతగా ఎదురు చూస్తున్నా .. దానికి తరచూ రిపేర్లు వస్తూనే ఉన్నాయి. పోనీలే ఎన్నికల నాటికి ఆ రిపేర్లు పూర్తి చేసి రేస్ కార్ లా దూసుకుపోదామంటే దానికి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు అడ్డం వస్తున్నాయి. దీంతో గులాబీ బాస్ పడుతున్న హైరానా అంతా ఇంతా కాదు. కొత్త కొత్త పథకాలు తీసుకు వచ్చి జనాల్లో క్రేజ్ కొట్టేద్దామని చూస్తున్న కేసీఆర్ కు పార్టీ ఎమ్యెల్యేలు పెద్ద అవరోధంగా మారారు. వారి మీద నియోజకవర్గాల్లో ప్రజలకు సదభిప్రాయం లేకపోవడం, అవినీతి, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. దీని కారణంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లోకి దూసుకుపోదామని చూస్తున్న కేసీఆర్ కలలను కల్లగా చేసేస్తున్నారు.

ఎప్పటికప్పుడు పార్టీ మీద, ప్రభుత్వం మీద , ఎమ్యెల్యే ల పని తీరు మీద సర్వేలు చేయిస్తున్న కేసీఆర్ కి దిమ్మ తిరిగిపోయే విషయాలు వాస్తవాలుగా తెలుస్తున్నాయి. పార్టీ కంటే ఎమ్మెల్యేల పైనే వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతోంది. దీంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఏఏ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదో.. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమనే ఎమ్మెల్యేల లిస్ట్ తయారవుతోంది. 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు డేంజర్‌ జోన్‌ లోకి వెళ్లారు. ప్రస్తుతం అన్ని పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కలుపుకుంటే టీఆర్ఎస్‌కు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సగం మంది పని తీరు బాలేదని వారిని ఖచ్చితంగా మార్చాల్సిందే అని రిపోర్టులు అందాయి.

దీంతో చేసేది లేక రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ ఎమ్మెల్యేలను మార్చాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారట గులాబీ బాస్ . మొహమాటానికి పోతే వచ్చే ఎన్నికల్లో మట్టి కరవాల్సిందే అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. అదీ కాకుండా 46 మంది ఎమ్మెల్యేల లిస్ట్‌లో ఐదుగురు మంత్రులు ఉన్నారని సమాచారం. ఉత్తర తెలంగాణ కంటే దక్షిణ తెలంగాణలోనే టీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు ఉన్నాయని తాజా సమాచారం. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌,నల్గొండ,రంగారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 46 మంది ఎమ్మెల్యేలకు సర్వే రిపోర్టులు పంపించారు. వచ్చే మూడు నెలల్లో పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఇక పార్టీ టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని , ఇందులో ఎటువంటి మొహమాటం లేదని తేల్చి చెప్పేశారట. దీంతో ఆ రిపోర్ట్ అందుకున్న ఎమ్యెల్యేల్లో టెన్షన్ మొదలయ్యిందట.