చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు మధ్య పరోక్షంగా వివాదం నడుస్తూనే ఉంది.ప్రోటోకాల్ ప్రకారం రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉన్నా, ఆయన హాజరు కావడం లేదు.
ఇక తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో గవర్నర్ తమిళసై పర్యటించిన సందర్భాల్లో ప్రభుత్వం తరఫున సరైన ప్రోటోకాల్ పాటించకపోవడం వంటి వ్యవహారాలతో ప్రభుత్వం గవర్నర్ మధ్య చాలా సార్లు వివాదం నడుస్తూనే ఉంది.అనేకసార్లు బహిరంగంగానే గవర్నర్ తమిళసై కెసిఆర్ , టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను విమర్శలు చేశారు.
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ బడ్జెట్ ఆమోదానికి సంబంధించి గవర్నర్, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది.
అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టే గడువు సమీపిస్తున్నా, గవర్నర్ దానికి ఆమోదం తెలపకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.దీనిపై అటు గవర్నర్ తరపు న్యాయవాది , ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించగా, కోర్టు దీనిపై స్పందించింది.
ఈ పిటిషన్ పై తాము ఎలా విచారణ చేపట్టగలమని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.గవర్నర్ విధుల్లోకి తాము ఎలా జోక్యం చేసుకోవాలని , ఈ వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమించి మరో వ్యవస్థలోకి ఎలా చొచ్చుకు వెళుతుందని , ఈ కోర్టు గవర్నర్ కు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయగలరని హైకోర్టు ప్రశ్నించింది.అసలు గవర్నర్ కు ఆదేశాలు ఇచ్చే పరిధి ఈ కోర్టుకు లేదని చెబుతూనే ఇరుపక్షాలు చర్చించుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని హైకోర్టు సూచించింది.హైకోర్టు ధర్మాసనం సూచనల మేరకు రాజ్యాంగ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదుల చర్చల్లో ఇరుపక్షాల.మధ్య సంధి కుదిరింది.ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుస్వంత్ దవే, అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ జయ రామచంద్ర రావు పాల్గొనగా,

గవర్నర్ తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ లు భోజనం విరామ సమయంలో చర్చించారు.వీటి ప్రకారం ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సంబంధిత మంత్రి గవర్నర్ ను ఆహ్వానించాలి.ఈ మేరకు గవర్నర్ ఆ బడ్జెట్ కు ఆమోదం తెలపాలి.అలాగే మంత్రి మండలి సిద్ధం చేసిన ప్రసంగం కాపీని గవర్నర్ అసెంబ్లీలో చదవాలి.అలాగే పెండింగ్ లో ఉన్న ఇతర బిల్లులకు ఆమోదం తెలపాలి.వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత మంత్రులు , కార్యదర్శుల వివరణ తీసుకోవాలి అని ఈ చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు.
