తెలంగాణాలో ముందస్తుకు బ్రేకులు ..? ఆ అంశం తో చిక్కులు     2018-09-17   12:13:23  IST  Sai M

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత ఆరాటపడుతున్నాడో … అంత వెనక్కి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరంగా … అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అంతే స్పీడ్ గా ఎన్నికల్లో గెలిచి మళ్లీ సీఎం పీఠం ఎక్కాలని చూస్తున్నాడు. నిజానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం టీఆర్ఎస్ మినహా ఏ పార్టీకి ఇష్టం లేదు.అందుకే ఈ ఎన్నికలను ఏదో విధంగా ఆపించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి కారణం పూర్తి స్థాయిలో పార్టీలు ఎన్నికలకు సిద్ధం కాలేకపోవడమే.

అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడో కొత్తరకం మెలిక పెట్టింది. తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయన్న అంశాన్నిలేవనెత్తింది. మర్రి శశిధర్ రెడ్డి.. ఈ విషయంలో ప్రత్యేకంగా పరిశోధన చేసి. 30 లక్షల ఓట్లు తేడా ఉన్నాయని తేల్చారు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి అధారాలు సమర్పించారు. కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఏఐసిసి కూడా తగిన సహకారం అందిస్తోంది. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసి అనంతరం తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఓటర్ల జాబితాలో టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉండేలా మార్పు చేర్పులు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

తెలంగాణలో దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లపై గందరగోళం నెలకొందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఓటర్ల జాబితాలో 38 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని చెబుతోంది. దీనిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 20 లక్షల ఓట్లు తొలగించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా… ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల 18 లక్షల మందికి ఓట్లున్నాయన్నారు. ఏపీలో కలిసిన ఏడు మండలాల ఓటర్ల గురించి.. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మొత్తం ఓటర్ల జాబితాలో 20 శాతం తప్పులున్నాయని, వీటిని సరిచేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ మెలిక పెడుతోంది.

Telangana Congress Puts KCR In Trouble About Elections 2019-Elections In Telangana,Eliminated List Of Telangana Voters,KCR,telangana Congress,Telangana Voter List

కాంగ్రెస్ ఆరోపణలతో అప్రమత్తమైన ఈసీ ఓటర్ల తాబితాలో మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టింది. ఎంత చేసినా. ఆ ఏడు మండలాల ఓటర్ల సంగతి తేల్చకపోతే.. ఎవరు కోర్టుకు వెళ్లినా ఇబ్బంది ఎదురువుతుందన్న అంచనాలున్నాయి. మండలాలను ఏపీలో కలిపినా ఓటర్లను మాత్రం తెలంగాణలోనూ చూపిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గ కేంద్రం మాత్రమే తెలంగాణలో ఉంది. మిగతా ప్రాంతాలన్నీ ఏపీలో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. ఏపీలో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలి. తెలంగాణలో తీసేయాలి. అది జరగడం చాలా కష్టమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఈ వివాదాన్ని కాంగ్రెస్ కోర్టు దాకా తీసుకెళ్తే ఇబ్బందేనన్న భావన ఎన్నికల నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నిటిని చూస్తుంటే…తెలంగాణలో ముందస్తు ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.