టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న ఈటెల రాజేందర్ అక్కడ అవమానకర పరిస్థితులు ఎదురవడంతో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.వెంటనే రాజేందర్ రాజీనామా ఆమోదం పొందడంతో మళ్లీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.
ఈటెల రాజేందర్ బీజేపిలో చేరడం, హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపొందడం వంటి పరిణామాలు బీజేపి లో ఉత్సాహం పెంచాయి పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తూ, ఆయన ద్వారా టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేసింది.అయితే రాజేందర్ మాత్రం బీజేపి విధానాలను పెద్దగా పట్టించుకోకుండా సొంత అజెండాతో ముందుకు వెళుతున్న తీరు పార్టీ నాయకులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది.
అలాగే తెలంగాణ బీజేపి లోని మెజార్టీ నాయకులకు రాజేందర్ వ్యవహారశైలి మింగుడు పడడం లేదు.
తెలంగాణ బీజేపీ లో తానే కీలక వ్యక్తిగా రాజేందర్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ నాయకులంతా ఒక విధానంతో ముందుకు వెళుతుంటే రాజేందర్ మాత్రం పూర్తిగా తన పరపతి పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుండటం బీజేపి విధానాల కంటే తన వ్యక్తిగత ఇమేజ్ పెరిగే విధంగా వ్యవహారాలు చేస్తుండడం పై బీజేపి హైకమాండ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోందట.అలాగే హుజురాబాద్ లో గెలిచిన తర్వాత ఇది బీజేపి విజయం కాదని, తన వ్యక్తిగత ఇమేజ్ ద్వారా మాత్రమే ఈ విజయం దక్కింది అంటూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రకటించారు.ప్రత్యక్షంగా జరిగే అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, స్థానిక సంస్థల్లో పూర్తిగా టీఆర్ఎస్ కు పూర్తిగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసినా ఉపయోగం ఉండదని రాష్ట్ర బీజేపి నాయకత్వం భావించింది.

అయితే ఈటెల రాజేందర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కు మద్దతు ఇస్తున్నామని, హైదరాబాదులో తానే అభ్యర్థిని నిలబెట్టాలని ప్రకటించారు.దీనిపై మిగతా బీజేపి నేతలు తీవ్ర ఆగ్రహానికి అసంతృప్తికి గురయ్యారు.అంతేకాదు పార్టీకి చెందిన సమావేశాల్లోనూ సొంత కులానికి చెందిన వారితోనూ సన్మానాలు చేయించుకుంటూ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.రాజేందర్ తీరుతో మిగతా నాయకులు అసంతృప్తితో ఉండడంతో పాటు ఈటెల రాజేందర్ వ్యవహారశైలిపై రాష్ట్ర నాయకత్వం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారట.
పార్టీ విధానాలు అనుసరించకుండా సొంత అజెండాతో ముందుకు వెళ్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇప్పటికే రాజేందర్ వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు బీజేపి కీలక నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.