తేజూ మూవీ కష్టాల్లో ఉందా?       2018-06-21   03:26:35  IST  Raghu V

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గత రెండు సంవత్సరాలుగా సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుసగా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్న తేజూ తాజాగా ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈయన చేసిన, చేస్తున్న చిత్రాలు చాలా సాదా సీదాగా, రొటీన్‌గా ఉంటున్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తేజూ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాత సాయి ధరమ్‌తేజ్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ దక్కలేదు. ఏమాత్రం ఆకట్టుకోని కథలతో ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు బొక్కబోర్లా పడ్డాయి.

తాజాగా ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ చిత్రాన్ని కరుణాకరన్‌ దర్శకత్వంలో కేఎస్‌ రామారావు నిర్మించాడు. ఈ చిత్రం చాలా విభిన్నంగా ఉంటుందని, మంచి ప్రేమ కథతో తెరకెక్కిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కాని సినిమా మాత్రం వారు చెబుతున్న స్థాయిలో ఉండదని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అందుకే సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. చిన్న సినిమా అయినా కూడా కాస్త ఎక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దాంతో ఇప్పుడు నిర్మాత కష్టాల్లో పడ్డట్లుగా సినీ వర్గాల్లో మరియు ట్రేడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం 8 కోట్ల మేరకు కూడా బిజినెస్‌ను చేయలేక పోతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమా స్థాయిని పెంచడంలో విఫలం అయ్యాయి. దాంతో సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు. ఆ కారణం వల్లే సినిమాను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు సినిమా విడుదల చేయాలంటే డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలి.

వచ్చే నెలలో అయిన సినిమాను విడుదల చేస్తారా లేదా అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం ఇలా విడుదలకు ఇబ్బందులు ఎదుర్కోవడం విచారకరం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి. నిర్మాత కేఎస్‌ రామారావు చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించి రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీతోనే రామారావుకు కష్టాలు తప్పడం లేదని సినీ వర్గాల వారు జాలి చూపుతున్నారు.