ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల హడావుడి తప్ప పెద్దగా నాయకుల సందడి కనిపించడం లేదు.అసలు యువతను ఆకర్షించే విధంగా తెలుగుదేశం పార్టీలో పరిణామాలు లేకపోవడం, చంద్రబాబు రాజకీయ వారసుడు, యువ నాయకుడు లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్నా, యువతను ఆకర్షించే విధంగా వ్యవహరించడం లేకపోవడం వంటి పరిణామాలతో ఇతర పార్టీల వైపు యువత అంతా మొగ్గు చూపిస్తున్నారు తప్ప టిడిపి వైపు కన్నెత్తి చూడడం లేదు.
పార్టీలో సీనియర్ నాయకులు మాత్రమే టిడిపి వైపు మొగ్గు చూపుతుండగా, మిగతా వారు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.క్షేత్రస్థాయిలో ఇదే రకమైన పరిస్థితి ఉండడం, యువతను ఆకర్షించే విధంగా టిడిపి లేకపోవడం వంటివి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
వాస్తవానికి తెలుగు దేశం పార్టీకి మెయిన్ పిల్లర్ గా యూత్ బలం ఎక్కువగా ఉంది.తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగు యువత వెన్నుదన్నుగా నిలబడేది.
తెలుగు యువతగా సారథ్యం వహించిన చాలా మంది ఆ తర్వాత నాయకులుగా ఎదిగి, ఉన్నతమైన పదవులు పొందారు .అసలు తెలుగు యువత అధ్యక్ష పదవి అంటే, ఒకప్పుడు పోటీ తీవ్రంగా ఉండేది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఒకప్పుడు నందమూరి హరికృష్ణ, అమర్నాథ్ రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్, దగ్గుబాటి వెంకటేశ్వరావు, రవిచంద్ర యాదవ్, ఇలా చాలామంది తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వారే.

తెలుగు యువత అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న దేవినేని అవినాష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆ పదవిలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు.అయితే చంద్రబాబు కమ్మ సామాజిక వర్గం కాకుండా, ఇతర సామాజిక వర్గాల వారికి ఆ పదవి అప్పగించాలనే అభిప్రయంలో ఉన్నారు.ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు పరిశీలనకు వచ్చాయి.చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్ మాథుర్ వంటి పేర్లు పరిశీలనకు వచ్చినా, వారు ఎవరూ తెలుగు యువత అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఇష్టపడకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేర్లను కూడా బాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే నాదెళ్ల బ్రహ్మం చౌదరి కూడా తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండడం, లోకేష్ కు ఆయన అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతో, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు అవుతారని ప్రచారం జరుగుతున్నా, చంద్రబాబు ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు ఇష్టపడడంలేదట.అసలు రాజకీయ వారసులకి కాకుండా, జనం నుంచి వచ్చిన నాయకుడిని ఆ పదవిలో నియమిస్తే పార్టీకి కలిసొస్తుందని, అలాగే కమ్మ సామాజిక వర్గం వారు కాకుండా, ఇతర సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎటువంటి విమర్శలు లేకుండా ఉంటుందనేది చంద్రబాబు అభిప్రాయంగా తెలుస్తోంది.