సీమలో తప్పులు చేస్తున్న టీడీపీ ... బలం పుంజుకుంటున్నవైసీపీ !       2018-07-08   01:12:28  IST  Bhanu C

రాష్ట్ర వ్యాప్తంగా తమకు తిరుగులేదని ప్రజా సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు చేశామని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసులు గెలుచుకున్నామని టీడీపీ భావిస్తోంది. కానీ వస్తావా పరిస్థితులు మాత్రం గ్రహించలేకపోతోంది. ఇక రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే… ఇక్కడ మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి పట్టు ఉంది. అది సాధారణంగానే వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే ఈ మద్య కాలంలో వైసీపీ బాగా బలహీనపడిందని, టీడీపీ హవా పెరిగిందనే ఆలోచనలో చంద్రబాబు ఉండిపోయాడు. కానీ సీమ టీడీపీ నేతలు చేస్తున్న కొన్ని తప్పులు కారణంగానే వైసీపీ బాగా బలం పుంజుకుందని ప్రస్తుతం టీడీపీ కంటే వైసీపీకి అనుకూలంగా ఉందని తేలడంతో బాబు లో ఆందోళన పెరుగుతోంది.

మొదటి నుంచి రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి పట్టు ఉండడంతో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కర్నూలు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరిని టీడీపీలో చేర్చేసుకున్నారు. ఇక్కడ వైసీపీ ఆధిపత్యం తగ్గించేందుకు చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి.. స్వయంగా చంద్రబాబే పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు వైసీపీని దెబ్బకొట్టేందుకు ఒకవైపు వ్యూహాలు పన్నుతుండగానే మరోవైపు టీడీపీ బలహీన పడుతుండటం టీడీపీలో ఆందోళన పెంచుతోంది. ఇది ఇలాగ ఉండగానే టీడీపీలో పెరిగిన వర్గ విబేధాలు కూడా ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి.

కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల, కోడుమూరు, కర్నూలు, బనగానపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మధ్య సమన్వయము లేదు. నిత్యం ఎదో ఒక విషయంపై రోడ్డున పడుతూనే పార్టీ పరువు తీసేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు , పార్టీ మారి కొత్తగా వచ్చిన వారికి పాత నాయకులకు, పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తల మధ్య గొడవలను సర్దుబాటు చేయటానికి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. కడప జిల్లాలో ఫిరాయింపు మంత్రి ఆది నారాయణ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. బద్వేలు ఫిరాయింపు ఎమ్మెల్యే జయ రాములుకు, టీడీపీ నేతలకు పడట్లేదు. ఇక రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆది నారాయణరెడ్డి, ఎమెల్సీ రామ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లిపోయారు.

ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే… ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఇక్కడ పెద్ద తలపోటుగా తయారయ్యాడు. ఈ జిల్లాలో ఉన్న పదమూడు మంది ఎమ్మెల్యేల మధ్య సమన్వయమే లేదు. దివాకర్ రెడ్డి పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరితోనూ ఆయనకు పొసగడంలేదు. అదే విధంగా మొత్తం జిల్లాను తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలన్న కోరికతో జిల్లాలోని కీలక నేతలకు పొగపెడుతున్నారు. సీమ జిల్లాల్లో వైసీపీని ఎదుర్కోవడం అంత సులువైన పని కాదని టీడీపీ బలహీనతలే వైసీపీకి కలిసి వస్తున్నాయని సర్వేల్లో తేలడంతో టీడీపీ ఆందోళన చెందుతోంది. సీమ జిల్లాల్లో పట్టు కోల్పోతే అసలుకే ఎసరు వస్తుంది అన్న కోణంలో ఉన్న బాబు ఇక పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టాలని చూస్తున్నాడు.