ఏపీలో ఒకపక్క టిడిపి వైసిపి మధ్య రాజకీయ యుద్ధవాతావరణం చోటు చేసుకున్న సమయంలోనే, హుజురాబాద్ ఉప ఎన్నికల వేడి మరోవైపు రాజుకుంది.ఇక్కడ టిడిపి, జనసేన పార్టీ లు పోటీకి దూరంగా ఉన్నా, వైసీపీతో తలపడేందుకు బిజెపి తమ అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికల ప్రచారం సాగిస్తోంది.
బద్వేల్ నియోజకవర్గం లో దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య దాసరి సుధ పోటీ చేస్తున్నారు.ముందుగా ఈ ఎన్నికల్లో టిడిపి తమ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ను ప్రకటించింది.
ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించుకున్నారు.కానీ జనసేన తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదు అంటూ ప్రకటించిన తరువాత, టిడిపి కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడి, తాము అభ్యర్థిని నిలబెట్టడం లేదంటూ ప్రకటించింది.
దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా అభిప్రాయపడినా, బీజేపీ మాత్రం అభ్యర్థి నిలబెట్టింది. మొన్నటి వరకు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించకపోయినా, వైసీపీ శ్రేణులు టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడికి దిగిన తర్వాత టిడిపి నాయకుల్లో ఉత్సాహం పెరిగింది.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసి ఉంటే, గెలిచినా, గెలవకపోయినా గట్టిపోటీ ఇచ్చేందుకు ఆస్కారం ఏర్పదేది.కానీ ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా పోయిందనే బాధ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.
టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిన తరుణంలో ఆ పార్టీ మద్దతుదారులు , టిడిపి ఓటు బ్యాంకు ఇప్పుడు ఎటు వైపు మళ్ళుతుంది అనేది అందరికీ ఆసక్తికరంగానే మారింది.

టిడిపి జనసేన ఓట్లు బిజెపి వైపు డైవర్ట్ అవుతాయా అంటే అది అనుమానమే.జనసేన బీజేపీల మధ్య పొత్తు ఉన్నా, ఎవరికి వారు విడివిడిగా రాజకీయ వ్యవహారాలు చేపడుతూ ఉండడంతో, ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు.దీంతో జనసేన ఓట్లు పూర్తిస్థాయిలో బీజేపీకి పడే అవకాశం లేదు.
ఇక టీడీపీ విషయానికొస్తే ఇక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలని విషయంలోనూ గందరగోళం నెలకొంది.ఈ విషయంలో టీడీపీ అధిష్టానం నుంచి ఏ విధమైన ప్రకటన రాకపోవడంతో వైసిపి అభ్యర్థి దాసరి సుధ పై సానుభూతితో టిడిపి ఓటు బ్యాంక్ వైసీపీ కి డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.