సైకిల్ కి బ్రేకులు లేవా ..? పరుగులెట్టేయడం ఖాయమేనా ..?       2018-06-17   00:29:24  IST  Bhanu C

జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే సూచనలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తుండడంతో ముందస్తుకు వెళ్తేనే మంచిది అనే ఆలోచనలో బీజేపీ ఉంది. బీజేపీ కూడా ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాల నుండే వ్యతిరేకత వస్తుండటంతో అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలలో తమ ఉనికిని కాపాడుకోడానికి ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసింది

ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి వారే తమకే ప్రజలు పట్టం కడతారని ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతూ తమకు ఎన్నికలు జరగటం సమ్మతమేనని వారి అభిప్రాయాన్ని స్పష్టం చేసేశారు. ఇక ఎన్నికలు ముందస్తు వస్తున్నాయనగానే రాజకీయ నాయకులతో పాటు పలు సంస్థలు ఎన్నికలపై సర్వే లు నిర్వహించడం సాధారణ విషయమే. అలాగే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ లో ఏపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అనే ఆసక్తి సహజంగానే అందరిలో ఉంది.

ఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి 110, వైసీపీకి 60, జనసేన మరియు ఇతరులకు కలిపి 5 సీట్లు రావచ్చని తేలింది. ఈ సర్వే ఏ.బి.ఎన్ కోసం ఆర్.జి ఫ్లాష్ నిర్వహించింది. ఈ సంస్థకు సర్వే లో ప్రముఖమైన స్థానం ఉండటంతో ఈ సర్వేకి కూడా ప్రాధాన్యత వచ్చింది. ఇంతకీ ఈ సర్వే ఎలా, ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోని చేశారు అనేవి చూద్దాం..

ఈ సంస్థ ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ కు చెందింది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ సంస్థ సర్వేలు చేయటం అవి దాదాపు ఫలితాలకు దగ్గరగా ఉండటం తెలిసిందే.

ఈ సర్వే లో ప్రధానంగా తీసుకున్న అంశాలలో ప్రత్యేక హోదా అదికూడా ఎవరు ఎంత వరకు హోదాకై కృషి చేశారు అనేది పరిగణలోకి తీసుకోవటం జరిగింది(ప్రజల అభిప్రాయం); ఇంకా ప్రధానంగా ఐదు ప్రశ్నలు సూటిగా ప్రజలను అడిగారు, అవేమంటే

-ఏపీకి మోడీ అన్యాయం చేశాడా? అంటే ప్రజలు అవును అని 83.67 శాతం కాదు అని 16.33 శాతం అన్నారు.

-ఏ పార్టీకి ఓటు వేస్తారు? టీడీపీకి 44.04 శాతం, వైసీపీకి 37.46 శాతం, జనసేనకి 8.90 శాతం, బీజేపీకి 1.01 శాతం, ఇతరులకి 3.19 శాతం, లెఫ్ట్ కి 5.40 శాతం.

-ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? టీడీపీకి 110, వైసీపీకి 60, ఇతరులకు 5.

-హోదా కోసం పోరాడుతున్నది ఎవరు? టీడీపీ పోరాడుతుందని 43.83శాతం, వైసీపీ 37.46 శాతం, జనసేన 9.65 శాతం, లెఫ్ట్ 1. 08 శాతం మరియు ఇతరులు 4.87 శాతం పోరాడుతున్నట్టు ప్రజలు తీర్పు ఇచ్చారు.

-చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారు? తృప్తితో ఉన్నవారు 53. 69 శాతం, అసంతృప్తితో ఉన్నవారు 46.31 శాతం.

ఈ సర్వే లన్ని ఆయా ప్రభుత్వాలు సొంతగా చేయించుకునేవిగా ఉన్నాయని, ఇదికూడా ఎన్నికల వేళ ఒక రాజకీయ ఎత్తుగడేనని విమర్శలు కూడా వస్తున్నాయి. చూద్దాం ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందో.