కొడాలి నాని కోసం టీడీపీ వేసిన స్కెచ్ ఇదే     2017-01-01   22:58:47  IST  Bhanu C

ఏపీలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకటి అయిన కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయం రసకందాయంగా మారనుంది. గత కొంత కాలంగా గుడివాడలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇక్క‌డ రాజ‌కీయాలు ఎంత హాట్‌గా ఉన్నాయో స్ప‌ష్టం చేస్తున్నాయి. గ‌తంలో రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాని ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసి మూడోసారి గుడివాడ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.

వైసీపీలోకి వెళ్లిన కొడాలి అప్ప‌ట్లో చంద్ర‌బాబు మీద తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈ విమ‌ర్శ‌లు పెద్ద సంచ‌ల‌న‌మ‌య్యాయి. ఇక కొద్ది రోజులుగా గుడివాడ మీద ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన చంద్ర‌బాబు, లోకేష్ అక్క‌డ నాని దూకుడుకు ముకుతాడు వేయ‌డంతో పాటు నానికి క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ న‌గ‌రానికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ప్రొటోకాల్‌ ఇన్‌చార్జిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది.

రెండు రోజుల క్రితం గుడివాడ మునిసిపాలిటీలో జ‌రిగిన ఫైటింగ్‌లో ఎమ్మెల్యే నాని నేరుగా ఎంట్రీ ఇవ్వ‌డం…నానితో పాటు వైసీపీ కౌన్సెల‌ర్ల ఎటాక్‌ను టీడీపీ శ్రేణులు గ‌ట్టిగా తిప్పికొట్ట‌డంతో నానికి మైన‌స్‌గా మారింది. రోజు రోజుకు గుడివాడ‌లో నాని ప‌ట్టు త‌గ్గుతోందా అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక్క‌డ టీడీపీని బ‌లోపేతం చేసేందుకు ఆ పార్టీ వేసిన స్కెచ్‌లు చూస్తుంటే నానికి దిమ్మ‌తిరిగిపోయేలా ఉన్నాయి.

గుడివాడలో వైసీపీ త‌ర‌పున గెలుపొందిన చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావును పార్టీలో చేర్చుకున్న టీడీపీ ప‌ట్ట‌ణంలో ఆయ‌న ద్వారా నానిని దెబ్బ‌కొట్టింది. ఇక ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు టీడీపీలో చేరడంతో నియోజకవర్గ పరిధిలోని నందివాడ మండలంలో టీడీపీ పూర్తిగా బలపడింది. గుడివాడ రూరల్‌ మండలంలో గుత్తా శివరామకృష్ణ(చంటి) తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపిక‌వ్వ‌డంతో అక్క‌డ కూడా పార్టీకి తిరుగులేకుండా దూసుకుపోతోంది.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లం టీడీపీకి ఆదినుంచి కంచుకోటే. ఈ మండ‌లానికి చెందిన పార్టీ సీనియ‌ర్ నేత సీఎల్‌.వెంక‌ట్రావును స్వచ్ఛ భారత మిషన్‌ వైస్‌ చైర్మన్‌గా నియమించడంతో పార్టీ మరింత పటిష్టపడింది. దీంతో నానికి ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పెట్టేస్తున్నారు. ఇక గుడివాడ టౌన్‌లో భారీ ఎత్తున సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం జ‌రుగుతోంది. కొత్త మునిసిప‌ల్ భ‌వ‌న ప్రారంభోత్స‌వానికి చంద్ర‌బాబే స్వ‌యంగా రానున్నారు. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుడివాడ‌లో టీడీపీ జెండా ఎగుర వేసేందుకు టీడీపీ వేస్తోన్న ఎత్తులతో కొడాలి నాని దిమ్మ‌తిరిగి పోతోంద‌న్న టాక్ గుడివాడ‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.