టెన్షన్ పెడుతున్న కంచుకోటలు.. స్పీడ్ పెంచిన టీడీపీ       2018-07-05   00:17:58  IST  Bhanu C

ఎన్నికల్లో విజయం సాధించాలంటే వ్యూహం తప్పనిసరి. తమ బలం కంటే ఎదుటివారి బలహీనతలను గుర్తించి దానికి అనుగుణంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుంది. లేకపోతే ఎన్నికల్లో చిత్తూ అవ్వాల్సిందే. సరిగ్గా ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తోంది. ఏ పార్టీకి ఏ జిల్లాలో పట్టు ఉంది..? ఏ సామజిక వర్గం ఎటువైపు చూస్తోంది అనే లెక్కల్లో టీడీపీ అధినేత ఉన్నారు. ముఖ్యంగా తమకు అధికారం తెచ్చిపెట్టిన గోదావరి జిల్లాలపై బాబు ప్రత్యేక దృష్టిపెట్టారు.

టీడీపీ కనుచుకోటాలు అయినా గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు విశేష ఆదరణ రావడం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో టీడీపీ ఆందోళన చెందుతోంది. అందుకే … ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తికి తూర్పులో పార్టీని సెట్ చేసే బాధ్యతను అధినేత అప్పగించినట్లు పార్టీవర్గాల సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో వున్న గ్రూప్ తగాదాలను పరిశీలించడంతో పాటు వైసిపి, జనసేన ప్రభావాన్ని అంచనా వేసి వాటికి ధీటుగా పార్టీ వ్యూహాన్ని తయారు చేసేందుకు కేఈ రంగంలోకి దిగారు.

తూర్పుగోదావరిలో కీలకమైన రాజమండ్రి పార్లమెంట్ స్థానం ఈసారి బీసీకే కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో టిడిపి ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతోంది. పార్టీలు ఏవైనప్పటికీ కమ్మ సామాజికవర్గాన్ని ఆదరించే నియోజకవర్గాన్ని వదులుకోవడం టీడీపీకి కష్టసాధ్యమయ్యే పరిస్థితి. సిట్టింగ్ ఎంపి మురళీమోహన్ ను మార్చాలని అధిష్టానం భావించినా తిరిగి అదే సామాజికవర్గం లో ఒకరికి టికెట్ ఇవ్వక తప్పదు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో అధినేత చంద్రబాబు పర్యటిస్తే తూర్పు గోదావరిలో సీనియర్ నేత కేఈ కృష్ణ మూర్తి రంగంలోకి దిగారు.

జనసేన రంగప్రవేశంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడలతోనే ముందుకు వెళుతున్నాయి. టీడీపీకి జిల్లాకు చెందిన మరో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఉన్నప్పటికీ ఆయన సామాజిక వర్గం ఆయనతో లేరు. గతంలో ప్రజారాజ్యం వైపు కాపు సామాజికవర్గం మొగ్గుచూపినట్లే ఈసారి జనసేన వైపు గోదావరి జిల్లాలలో ఆ సామాజికవర్గం మొగ్గు చూపుతుంది. ఈ పరిస్థితుల్లోనే గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ సామాజికవర్గం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

,