రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే     2017-01-17   01:30:14  IST  Bhanu C

సినీ న‌టుడిగా, నిర్మాత‌గా, పారిశ్రామిక వేత్త‌గా ఎన్నో విజయాలు అందుకున్న రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ రాజ‌కీయాలకు గుడ్ బై చెప్ప‌నున్నారా? అంటే అవుననే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. కొంత కాలం నుంచీ ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా లేక‌పోవ‌డం గ‌మ‌నించిన వారంతా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తంచేస్తున్నారు. త‌న‌ వార‌సురాలిగా కోడ‌లు రూపాదేవిని రంగంలోకి దించినా.. ఫ‌లితం లేద‌నే టాక్ వినిపిస్తున్నాయి.

2009లో టీడీపీ త‌ర‌ఫున‌ రాజ‌మండ్రి ఎంపీగా పోటీచేసిన ముర‌ళీమోహ‌న్‌.. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చేతిలో ప‌రాజయం చ‌విచూశారు. అయితే ప‌ట్టువ‌ద‌ల‌కుండా 2014లో 1.57 వేల ఓట్ల‌తో ఉండ‌వ‌ల్లిపైనే ఘ‌న‌విజ‌యం సాధించారు. అప్పటినుంచి నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తన రాజకీయ పీఠాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఆయనకు శస్త్రచికిత్స అయినప్పుడు.. తర్వాత అనారోగ్యంగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో త‌న వార‌సురాలిగా కోడ‌లు రూపాదేవిని అన‌ధి కారికంగా ప్ర‌క‌టిం చేశారు. తాను పాల్గొన్న అన్ని కార్యక్రమాలకు ఆమెను కూడా తీసుకెళ్లి ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

అయితే ముర‌ళీమోహ‌న్ ఇక రాజ‌కీయాల నుంచి దూరం కావాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా త‌న‌ బ‌దులు రూపాదేవితో 2019ల్లో పోటీచేయించినా.. గెలిచే అవ‌కాశాలు క‌ష్ట‌మ‌ని తెదేపా వ‌ర్గాలు చెబుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లపై దృష్టిసారించ‌లేక‌పోవ‌డం ఆయ‌న‌కు ప్ర‌ధాన అడ్డంకిగా మారింద‌ని విశ్లేషిస్తున్నాయి. ఇవి ఆమె విజ‌యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ ఎంపీగా గ‌తంలో ముర‌ళీమోహ‌న్‌పై వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ చౌద‌రికే అవ‌కాశం క‌ల్పిస్తార‌నే కోణంలో వార్త‌లు వినిపిస్తున్నాయి.