షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!   TDP MP Mother To Join In Janasena Party     2017-01-17   05:36:29  IST  Bhanu C

పాలిటిక్స్ అన్నాక‌.. అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు.. జంపింగ్‌లు చేస్తుంటేనేకానీ మ‌జా ఉండ‌దు! అన్న‌ట్టు.. సీనియ‌ర్ నాయ‌కురాలు.. కాంగ్రెస్ హ‌యాంలో రాష్ట్ర మంత్రిగా చ‌క్రం తిప్పిన గ‌ల్లా అరుణ కుమారికి ఇప్పుడు టీడీపీలో కాలు నిల‌వ‌డం లేద‌ట‌! ఎప్పుడెప్పుడు సైకిల్ దిగి.. జ‌న‌సేనాని చెంత‌కు చేరిపోదామా? అని ఎదురు చూస్తున్నార‌ట‌. మ‌రి విష‌యంలోకి వెళ్లిపోదామా…! కాంగ్రెస్ హ‌యాంలో వైఎస్‌కి అత్యంత స‌న్నిహితురాలిగా పేరుతెచ్చుకున్న గ‌ల్లా.. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ర‌ణం అనంత‌రం కూడా కిర‌ణ్ రెడ్డి ప్ర‌భుత్వంలోనూ కొన‌సాగారు.

అయితే, రాష్ట్ర విభ‌జ‌న పాప‌మా అని కాంగ్రెస్ చిరిగిన విస్త‌రి అయిపోయిన నేప‌థ్యంలో ఒక్క‌సారిగా చంద్ర‌బాబు చెంత‌కు చేరుకున్నారు. త‌న కుమారుడు గ‌ల్లా జ‌య‌దేవ్‌కి గుంటూరు ఎంపీ సీటును కేటాయించేలా చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో గ‌ల్లా ఎంపీగా ఎన్నిక‌వ‌డం తెలిసిందే. టీడీపీలోకి చేరాక త‌న కొడుకు ఎంపీ అయితే అయ్యాడు కానీ.. అరుణ కుమారికి మాత్రం రాజ‌కీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని దిగులు ప‌ట్టుకుంద‌ట‌. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నుంచి మూడుసార్లు వ‌రుస‌గా గెలిచిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అప్ప‌టి నుంచి ఆమె రాజ‌కీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. 2019లో గ‌ల్లా అరుణ‌కు చంద్ర‌బాబు సీటు ఇస్తారా ? లేదా ? అన్న‌ది డౌట్‌గా ఉంద‌న్న చర్చ‌లు టీడీపీలో వినిపిస్తున్నాయి. గుంటూరు ఎంపీ సీటు నుంచి చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రైనా లేదా నారా బ్రాహ్మ‌ణి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే అక్క‌డ ఎంపీ జ‌య‌దేవ్‌ను బాబు చంద్ర‌గిరి అసెంబ్లీ బ‌రిలో దించుతార‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే జ‌రిగితే అరుణ‌కు సీటు రాదు.

ఈ క్ర‌మంలోనే అరుణ‌కుమారి 2019 ఎన్నిక‌ల‌కు టైం ఉండ‌గానే సీటు చ‌క్క‌బెట్టుకోవాల‌ని ప్లాన్ వేస్తున్నార‌ట‌. ప‌వ‌న్ నేతృత్వ‌లోని జ‌న‌సేన‌లోకి వెళ్లిపోతే.. త‌న సీటు ఖాయమ‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీంతో ఆమె జ‌న‌సేన‌లోకి జంప్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. గ‌ల్లా అరుణ జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నా.. స్వాగ‌తించి.. సీటిచ్చేందుకు ప‌వ‌న్ సిద్ధ‌మా? అనేది ఇప్పుడు అంద‌రికీ ఉన్న డౌట్‌! గ‌ల్లా అరుణ తిరుప‌తి నుంచి జ‌నసేన త‌ర‌పున పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇటీవ‌ల నూత‌న సంవ‌త్స‌ర‌, సంక్రాంతి శుభాకాంక్ష‌ల ఫ్లెక్సీల్లో సైతం అరుణ – చంద్ర‌బాబు బొమ్మ‌లు ద‌ర్శ‌నీయ‌డం అరుణ జ‌న‌సేన ఎంట్రీ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని ఇస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లో నిజానిజాలు గ‌ల్లా అరుణ స్వ‌యంగా వెల్ల‌డించే వ‌ర‌కు చెప్ప‌లేం.