కేసీఆర్ ఆంధ్రా ప్రేమ సీక్రెట్ లీక్‌     2017-01-07   01:10:31  IST  Bhanu C

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ వారి కంటే ఆంధ్ర ప్రాంతం వారే ఎక్కువ అయ్యారా? వారిపైనే అధిక ప్రేమ‌ను కురిపిస్తున్నారా? అంటే అవునంటున్నారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి!! తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డికీ మ‌ధ్య గ‌ల పోరు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు!! ఎక్కడ ఏ అంశం దొరికినా.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శ‌లు గుప్పించే రేవంత్‌.. మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ద‌ళితుల స‌మ‌స్య‌లపై సీఎం మాట్లాడ‌క‌పోవ‌డంపై ఫైర్ అయ్యారు. అంతేగాక కేసీఆర్‌ ఆంధ్రా ప్రేమ సీక్రెట్ల‌ను బ‌య‌టపెట్టారు.

కేసీఆర్‌పై రేవంత్‌ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా కేసీఆర్‌ ఆంధ్రా వాసుల‌పై అభిమానం చూపుతూ.. తెలంగాణ‌కు చెందిన క్రీడాకారుల‌పై స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపిస్తున్నార‌ని విమర్శించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డలు పూర్ణ – ఆనంద్ లకు రూ. 25 లక్షలు బహుమానాన్ని ఇచ్చామని సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారని.. అయితే తెలంగాణకు సంబంధంలేని పీవీ సింధుకు రూ. 4 కోట్ల బహుమానాన్ని ఇవ్వడంతో పాటు హైదరాబాద్ నగరంలో రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కూడ కానుకగా ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు.

ఈ ప్రాంతానికి చెందని పీవీ సింధుకు కోట్ల రూపాయల విలువైన 1000 గజాల స్థలాన్ని కేటాయించిన కేసీఆర్ – తెలంగాణ బిడ్డలైన పూర్ణ – ఆనంద్ లకు కనీసం 200 గజాల స్థలాలనైనా ఇచ్చారా? అని రేవంత్ నిలదీశారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కూడా సీఎం కోట్ల రూపాయలు న‌జ‌రానాలుగా ఇచ్చార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అసెంబ్లీ సమావేశాలలో అన్ని ముఖ్య అంశాలపై చర్చ జరిగే సమయంలో కేసీఆర్ – కేటీఆర్ – హరీష్ రావులు పాల్గొని ముచ్చట్లు చెప్పారని అన్నారు. అయితే ఎస్సీ – ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చ జరిగే సమయంలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ – హరీష్ రావులు కూడ గైర్హాజరు కావడం ఏమటిని ప్రశ్నించారు. దళితుల సమస్యలపై చర్చలోను – దళిత క్రీడాకారులను ప్రోత్సహించడంలోను సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.