టీడీపీలో వాళ్ల ప‌నైపోయిందా..!     2017-01-07   04:46:18  IST  Bhanu C

ఏపీ అధికార పార్టీలో ఇన్‌ఛార్జీల హ‌వా క‌నుమ‌రుగైన‌ట్టే క‌నిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ఇన్‌ఛార్జులపై ఇప్పుడు సాక్షాత్తూ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి పార్టీలో ఇన్‌ఛార్జుల హ‌వా ఇప్ప‌టిదికాదు. గ‌త కొన్నాళ్లుగా వాళ్లు .. అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను మించి పోతున్నారు. ఎమ్మెల్యేల క‌న్నా ఎక్కువ‌గానే రాజ‌సం వెల‌గ‌బెడుతున్నార‌నే టాక్ ఉంది. అయితే, వీరే పార్టీని అన్ని విధాలా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తుండ‌డంతో అధినేత వీరిని చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేశారు. అయితే, రానురాను వీరి ప‌రిస్థితి మ‌రింత‌గా పేట్రేగ‌డంతో అధినేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

నిజానికి నియోజ‌క వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు, కాంట్రాక్టుల కేటాయింపులు ఉద్యోగుల బదిలీలు ఇలా అన్నింటా టీడీపీ ఇన్‌ఛార్జుల ఆధిప‌త్య‌మే నడిచేది. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యే ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది! నిజానికి, ఇన్ ఛార్జ్ లు అనేవారు ఎమ్మెల్యేలు కాక‌పోయినా స‌రే, ప్రోటోకాల్ ఉండేది. వారి వాహనాల ముందు పోలీసు జీపు, అధికారుల హంగామా షరా మామూలు. ఇలా ఇన్‌ఛార్జ్‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ర‌గిలిపోయిన ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జుల‌ను దూరం పెట్ట‌డంతోపాటు వారి హ‌వాను అధినేత చెవిలో వేశారు. మొద‌ట్లో చూసీ చూడ‌న‌ట్టు ఉన్న సీఎం చంద్ర‌బాబు. తాజాగా మాత్రం ఓ రేంజ్‌లో ఫైర‌య్యారని స‌మాచారం.

తాజాగా ప్ర‌భుత్వం ఇన్‌ఛార్జుల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని, ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇవ్వాల‌నీ, వారు చెప్పిన‌ట్టుగా చేయాల‌ని ఆదేశించింద‌ట‌! ఇన్‌ఛార్జ్‌ల‌కు ప్రోటోకాల్ అవ‌స‌రం లేద‌ని కూడా అందులో పేర్కొన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో కొంత‌మంది ఇన్‌ఛార్జ్‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. తాము పార్టీలో ఎంతో కీల‌కంగా ప‌నిచేస్తున్నామ‌ని, ఎమ్మెల్యేల క‌న్నా ఎక్కువ‌గా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నామ‌ని అయినా అధినేత ఇలా చేయ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నించుకుంటున్నార‌ట‌! మొత్తానికి చంద్ర‌బాబు త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించార‌ని ఎమ్మెల్యేలు హ్యాపీగా ఫీల‌వ‌డం గ‌మ‌నార్హం.