వారు చెడింది కాక‌.. పార్టీని సైతం చెడ‌గొడుతున్న ఆ మంత్రులు!       2018-05-29   02:10:34  IST  Bhanu C

చెడింది కాక‌.. చెడ‌గొడుతున్న చందంగా ఉంది.. టీడీపీలో ఆ ఇద్ద‌రు కీలక మంత్రుల ప‌రిస్థితి! విశాఖ‌కు చెందిన ఇద్ద‌రు మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడుల పేర్లు త‌ర‌చుగా మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. వీరిద్ద‌రికీ జాతి వైరం ఉన్న‌ట్టుగా ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డం, ఒక‌రి లోపాలు ఒక‌రుఎత్తి చూపుకోవ‌డం కామ‌న్‌గా మారిపో యింది. గంటా భూక‌బ్జా కోరు అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో అయ్య‌న్న రెచ్చిపోవ‌డం మీడియాలో మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. మంత్రి అయ్య‌న్న పోరు ప‌డ‌లేక ప్ర‌భుత్వం.. విశాఖ భూముల క‌బ్జాపై సిట్ వేసింది. అయినా కూడా ఈ ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య విభేదాలు, వివాదాలు.. నిత్య కృత్యంగా మారాయి. ఇలా ఒక‌రి ప‌రువు ఒక‌రు తీసుకుంటున్నారు. అయి తే, ఈ ఇద్ద‌రు మంత్రుల వ్య‌వ‌హారం.. వీరిద్ద‌రితోనే పోకుండా.. టీడీపీ ప‌రువు కూడా పోయేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విశాఖ జిల్లాలో నామినేటెడ్ ప‌దవుల‌ను ఎవ్వ‌రికీ కేటాయించ‌లేదు. అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వుల కోసం ప‌లువురు నాయ‌కులు ఇక్క‌డ ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భు్త్వం పెద్ద ఎత్తున నామినేటెడ్ ప‌ద‌వుల పందేరానికి తెర‌దీసినా.. విశాఖ విష‌యంలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు వేయ‌లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఈ ఇద్ద‌రు మంత్రులేన‌ని ఒకింత ఆల‌స్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో మంత్రులు ఇద్ద‌రు కూడా ప్ర‌భుత్వానికి కొన్ని సిఫార్సులు పంపారు. ఈ సిఫార్సుల్లో మంత్రులు ఇద్ద‌రు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నామినేటెడ్‌ పదవుల పంపకాన్ని నిలిపివేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

జిల్లా స్థాయి నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఈ ఇద్ద‌రు మంత్రుల వ్య‌వ‌హార శైలిపై ఆగ్ర‌హంతో ఉన్న చంద్ర‌బాబు వాటిని అలాగే వ‌దిలి వేశారు. ఇక‌, రాష్ట్రస్థాయి పదవుల్లో కూడా విశాఖపట్నం జిల్లాకు చెందిన వారినెవరినీ నియమిం చక పోవ‌డం గ‌మ‌నార్హం. గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్‌, వుడా, జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్‌ పదవులు భర్తీ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నప్పటికీ మంత్రులిద్దరూ వేరువేరుగా సిఫార్సు చేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న డిప్యూటీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కూడా అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

విశాఖపట్నభివృద్ధి సంస్థకు ఛైర్మన్‌గా రాజకీయవర్గానికి చెందిన వారిని నియమించేవారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఈ సంస్థ పరిధిలో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఈ ప‌ద‌విని అలాగే ఉంచేశారు. మొత్తంగా జిల్లాలో నామినేటెడ్ ప‌ద‌వులను పంప‌కం చేస్తే.. అభివృద్ధి జ‌ర‌గుతుంద‌నేది కింది స్థాయి నాయ‌కుల మాట‌. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో రాబోయే రోజుల్లో ఇక్క‌డ టీడీపికి దెబ్బ‌త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.