ఆస్ట్రేలియాను కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సిడ్నీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో నాలుగు వారాలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.డెల్టా వేరియంట్ ప్రజలను కలవరపెడుతుండటంతో జూన్ చివరి నుంచి సిడ్నీలో స్టే హోం ఆదేశాలు అమలవుతున్నాయి.
నగరంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2500 మంది కొవిడ్ బారినపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.బుధవారం కొత్తగా 177కి పైగా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
కాగా, లాక్‌డౌన్ వల్ల న్యూసౌత్ వేల్స్‌లోని వ్యాపారాలు, కార్మికులను గాడిలో పెట్టేందుకు గాను ప్రధాని స్కాట్ మోరిసన్ బుధవారం ఉపశమన ప్యాకేజ్‌ను ప్రకటించారు.ఇక్కడి ప్రజల కోసం వారానికి 750 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని వెల్లడించారు.
ఆస్ట్రేలియాలోని మిగిలిన నగరాలైన మెల్‌బోర్న్, అడిలైడ్‌లు సైతం లాక్‌డౌన్‌ను పొడిగించాయి.అయితే ఆస్ట్రేలియా వాణిజ్య కేంద్రంగా వున్న సిడ్నీ నగరంలో లాక్‌డౌన్ పొడిగింపు వల్ల పర్యాటక, రిటైల్ రంగాలపై పెను ప్రభావం చూపుతోంది.
కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రకారం.మూడవ త్రైమాసికంలో ఆర్ధిక వ్యవస్థ 2.7 శాతం కుదించబడింది.దీనిని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ లిమిటెడ్ 1.3 శాతంగా అంచనా వేస్తోంది.

మరోవైపు దేశంలోని పరిస్ధితుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాక్సిన్ వ్యూహాన్ సమర్ధించుకున్నారు.ఈ ఏడాది చివరినాటికి దేశ ప్రజలందరికీ డోసులు అందిస్తామని తెలిపారు.అయితే లాక్‌డౌన్ ఎత్తివేతపై మాత్రం ప్రధాని ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
అది జరగడానికి ముందు ఎంతమంది ఆస్ట్రేలియన్లకు టీకాలు వేయవలసి వుంటుందో సూచించలేదు.అయితే దీనిపై శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత క్లారిటీ రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు.‘తమకు వ్యాక్సిన్ అవసరం లేదు స్వేచ్ఛ కావాలి’ అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు.‘‘ ఫ్రీడమ్.ఫ్రీడమ్, వేకప్ ఆస్ట్రేలియా ’’ అంటూ నినాదాలు చేశారు.తమ ఆందోళనను ‘‘ స్వేచ్ఛా ర్యాలీ’’గా పేర్కొన్నారు.ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అడ్డుకోబోయిన పోలీసులతో ఘర్షణకు దిగారు.
సిడ్నీలో కొందరు నిరసనకారులు మొక్కలు, బాటిల్స్‌ను పోలీసులపైకి విసిరారు.అంతేకాదు నిరసనల్లో పాల్గొన్న చాలా మంది మాస్కులు ధరించలేదు.
దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
