బీజేపీలో చేరిపోయిన పీఠాధిపతి   Swamy Paripoornanada Join In Bjp     2018-10-19   18:37:12  IST  Sai M

అందరూ ఊహించినట్టుగానే … శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా అయన బీజేపీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అంతే కాదు ఆయన బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థి అంటూ కూడా ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా… ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. స్వామికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ, అమిత్ షాతో కలిసి పనిచేయాలని బీజేపీలో చేరానన్నారు స్వామి.

శుక్రవారం ఉదయం పరిపూర్ణానంద స్వామి ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం షా సమక్షంలో పార్టీలో చేరారు. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను ఆయనకు అప్పగించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.