మహేష్ బాబు కి లెటర్ రాసి..ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్ ఐటీ విద్యార్ధి       2018-04-27   00:29:53  IST  Raghu V

గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ లో చదువుతున్న ఓ విద్యార్ధి హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు.. తాను ఆత్మహత్య చేసుకున్న స్థలంలో రెండు లెటర్స్ బయటపడ్డాయి ఒకటి తన తల్లితండ్రులకి రాసినది అయితే మరొకటి టాలీవుడ్ హీరో మహేష్ బాబుకి రాసిన లెటర్..ఇప్పుడు ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. వివరాలలోకి వెళ్తే..

గుంటూరు జిల్లా సిద్దార్థనగర్‌కు చెందిన పులి శ్రీనివాస్‌రెడ్డి బెంగుళూరులో ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగి. ఈయనకు భార్య మయూరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పులి సునంద్‌కుమార్‌రెడ్డి(21) గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్‌సైన్స్‌ డ్యుయల్‌ డిగ్రీ కోర్సు 4వ సంవత్సరం చదువుతున్నాడు…క్యాంపస్‌లోని ఓల్డ్‌బాయ్స్‌ హాస్టల్‌లోని 267 గదిలో ఉంటున్నాడు. మూడునాలుగు రోజులుగా ఎదో దిగులుగా ఉంటున్న సునంద్ కి అతని స్నేహితుడు సాయిసాహిత్‌ బుధవారం రాత్రి ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు…దాంతో హాస్టల్ కి వెళ్లి చూసేసరికి సునంద్‌కుమార్‌రెడ్డి గదికి వెళ్లగా లోపలి నుంచి గడియ పెట్టిఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో కిటీకిలోంచి చూడగా సునంద్‌ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు.

దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించగా వారు గది తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి ఎస్సై చితకాయల వెంకటేష్ వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు చదువు ఒత్తిడి కారణం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. డిప్రెషన్‌కు ఇతర కారణాలు ఉండి ఉంటాయని, వారి కుటుంబసభ్యులు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని ఎస్‌ఐ చెప్పారు
అయితే అక్కడ దొరకిన రెండు లేఖల ప్రకారం చూస్తే ఒకటి తన తల్లిదండ్రులకురాసి ఉంది. ‘అమ్మా.. నాన్న..నేను ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి. మీరంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మీ తరుఫున బంధువులంటే నాకు ఇష్టం లేదు.. వారు కేవలం అవసరానికి వచ్చి వెళ్లేవారు.. భారతీయ బంధుత్వ వ్యవస్థ బాగా లేదు..’ అని ఒక లేఖలో రాశాడు. మరొక లేఖని హీరో మహేష్ బాబు కి రాశాడు..

మహేష్‌.. యూఆర్‌ మై డాక్టర్‌ అని రాసుకున్నాడు అతడి గది నిండా సినీ హీరో మహేష్‌బాబు ఫొటోలు ఉన్నాయి… ‘నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మీ సినిమాలే చూస్తాను.. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మీరే నా డాక్టర్‌, మీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు అంటూ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..మహేష్‌బాబుకు పెద్ద అభిమాని అని అతని స్నేహితులు తెలిపారు.