మన దేశంలోని ప్రతి శివాలయంలోనూ మనకు శివలింగం ముందుగా నంది దర్శనమిస్తుంది.నంది శివుని వాహనంగా సూచించబడుతుంది.
శివుడి ప్రథమ గణాలలో నందీశ్వరునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నంద్యాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో వెలసిన మహానందీశ్వర ఆలయం ఎంతో పేరుగాంచింది.
పర్యాటక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.ఈ ఆలయానికి చుట్టూ 18 కిలోమీటర్ల వలయంలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి.
ఈ ఆలయాలలో ఉన్న నందులనే నవనందులు అంటారు.అసలు నవనందులు అంటే ఏమిటి? వాటి విశిష్టత ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం.
ప్రథమ నంది:నంద్యాలకు నైరుతి దిక్కున చామకాల్వ ఒడ్డున నందీశ్వర ఆలయం ఉంది.నవనందులలో ఇది ప్రథమ నందిగా భావిస్తారు.
పూర్వం బ్రహ్మ కోరిక మేరకు పరమేశ్వరుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రథమ నందీశ్వరుడుగా వెలిశాడు.కార్తీకమాసం సూర్యాస్తమయ సమయంలో సూర్య కిరణాలు ఆలయంలోని నందీశ్వరుడు పై పడటం ఈ ఆలయ ప్రత్యేకత.
నాగ నంది: నంద్యాలలోని ఆంజనేయ స్వామి ఆలయంలో నాగ నంది విగ్రహం ఉండటంవల్ల ఈ ఆలయంలో వెలసిన పరమేశ్వరుడిని నాగా నందీశ్వరుడుగా పూజిస్తారు.పూర్వం గరుత్మంతుని దాటికి తట్టుకోలేక నాగులు పరమేశ్వరుడి కోసం ఇక్కడ తపస్సు చేశాయని, వారి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వారిని కాపాడినట్లు తెలుస్తోంది.
సోమ నంది: నంద్యాల పట్టణంలో ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమనందిశ్వరాలయం ఉన్నది.పూర్వం చంద్రుడు సోమేశ్వరుని కోసం ఇక్కడ తపస్సు చేయగా, ఇక్కడ శివుడు సోమ నందీశ్వరునిగా వెలిశాడని భక్తులు భావిస్తారు.
శివ నంది: మహానంది క్షేత్రానికి ఉత్తరం వైపున కాల్వ గ్రామంలో శివ నందీశ్వరాలయం ఉంది ఈ ఆలయం ఎంతో పెద్దదిగా అటవీ ప్రాంతంలో కొలువై ఉంది.
సూర్యనంది: పరమేశ్వరుడి కోసం సూర్యుడు తమ్మడపల్లి గ్రామంలో తపస్సు చేశాడు.సూర్యుడి కోరికమేరకు పరమేశ్వరుడి ఇక్కడే కొలువై ఉండి సూర్య నందీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.
విష్ణు నంది: మహానందికి ఉత్తరం వైపు నాలుగు కిలోమీటర్ల దూరంలో విష్ణు నందీశ్వరాలయం ఉంది.ఒకప్పుడు పరమేశ్వరుడు విష్ణువు కోసం ఇక్కడే తపస్సు చేయటంవల్ల విష్ణు కోరిక మేరకు ఆ పరమేశ్వరుడు ఇక్కడే కొలువై ఉండి విష్ణు నందీశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
మహానంది: మహానంది ప్రాంతాన్ని పాలించిన నంద వంశ రాజు ఒక రోజు పరమేశ్వరుడు కలలో కనిపించి మహానందితో పాటు చుట్టుపక్కల 8 ప్రాంతాలలో కొలువై ఉన్నానని అక్కడ ఆలయాలు కట్టించి అభివృద్ధి చేయాలని చెప్పడంతో రాజు మహానంది ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి.అయితే ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు.
వినాయక నంది : మహానంది క్షేత్రంలోని కోనేటి గట్టులో వినాయక నందీశ్వరాలయం ఉంది.పూర్వం వినాయకుడు కోనేటిలోనే తపస్సు చేయటం వల్ల ఇక్కడే వినాయక నందీశ్వరునిగా కొలువై ఉన్నాడు.
గరుడ నంది: వినాయక నంది క్షేత్రంలోకి ప్రవేశించే మార్గంలోనే గరుడ నందీశ్వరాలయం ఉంది.గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కోసం కలశాన్ని తెచ్చే సమయంలో తన పని విజయవంతం కావాలని పరమేశ్వరునికి తపస్సు చేయటం వల్ల గరుత్మంతుడు ఇక్కడే గరుడ నందీశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
ఈ విధంగా మహానంది క్షేత్రం చుట్టూ కొలువై ఉన్న తొమ్మిది నందులనే నవ నందీశ్వరాలయాలు అని పిలుస్తారు.కార్తీక మాసంలోని సోమవారాలలో ఆలయాలను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
DEVOTIONAL