హోదా విష‌యంలో బాబు యూట‌ర్న్‌?!       2018-04-13   03:40:02  IST  Bhanu C

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్న విష‌యం తెలిసిందే. హోదా విష‌యంలో అడిగిన వారిని అడిగిన‌ట్టు తిట్టిపోసిన బాబు ఇప్పుడు హోదా కోసం పోరు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో అన్ని పార్టీల నూ క‌లుపుకొని పోయేందుకు రెడీ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే అఖిల ప‌క్షం ఏర్పాటు చేశారు. దీంతో ఇంకేముంది .. బాబు మారిపోయారు.. హోదా కోసం పోరు చేస్తారు. అని నేత‌లంతా భావించారు. గ‌త నెల్లో క‌మ్యూనిస్టులు ఇచ్చిన బంద్ పిలుపున‌కు కూడా బాబు స‌హ‌క‌రించారు. రోడ్ల‌పైకి వ‌చ్చి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బ‌స్సుల‌ను బంద్ చేయించారు. మ‌రి ఇంత‌లా బాబు హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్నార‌ని అంద‌రూ అనుకుంటున్న తరుణంలో మ‌రోసారి బాబు వివాదాస్ప‌ద వ్యాఖలు చేశారు.

ప్రత్యేక హోదా కోసం బంద్‌లు చేసి ఏం సాధిస్తారని బాబు తాజాగా రాష్ట్రంలోని విపక్షాలను ప్రశ్నించారు. ఆందోళనలు చేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ప్రత్యేక హోదా సాంకేతిక అంశం కాదని, రాజకీయ అంశమని చెప్పారు. హోదా విషయంలో కేంద్రం వక్రీకరించి మాట్లాడిందని ఆరోపించారు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. తాను తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వ వాహనాలను రాష్ట్రంలో తిరగనివ్వబోనని హెచ్చరించారు. బీజే పీకి ఏపీలో అడ్రస్‌ లేకుండా చేస్తానన్నారు. తాను ఒక్క పిలుపు ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఏ ఒక్కటీ రాష్ట్రంలో తిరగవని, అది తనకు ఒక్క నిమిషం పని అని చంద్రబాబు పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. కానీ దానివల్ల జాతి ఎంతో నష్టపోతుందని, రాష్ట్రం డైవర్ట్‌ అయిపోతుందన్నారు.

టీడీపీ ఎంపీలతో ప్రతిపాదించి మోడీని ప్రధానిగా నిలబెట్టింది తానేనని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలనూ ఏకం చేసి మోడీని ప్రధానిని చేశామని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగితే తనపై ఎదురుదాడి చేస్తూ తిడుతున్నారని, అసమర్థ నాయకుడినని అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.మోడీపై రాజీలేని పోరాటం చేస్తామని, ఆయనపై దేశం మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితిని తెచ్చామన్నారు. అయితే, కేంద్రంపై ఇలా రెచ్చిపోతున్న చంద్ర‌బాబు మాత్రం ఇప్పుడు బంద్ విష‌యంలో యూట‌ర్న్ తీసుకోవ‌డంపై విప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. నిజానికి క‌మ్యూనిస్టు పార్టీలు సోమ‌వారం(15వ తేదీ) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం నుంచి ఎలాంటి స‌హ‌కారం అంద‌ని నేప‌థ్యంలో అన్ని పార్టీలూ క‌లిసి కేంద్రంపై ఒత్త‌డి తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వామ‌ప‌క్షాలు పేర్కొంటున్నాయి. మ‌రి ఇప్పుడు బాబు యూట‌ర్న్ తీసుకోవ‌డంపై వామ‌ప‌క్ష నాయ‌కులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.