ఇండియా నుంచి ఆస్కార్ కి ఎంపికయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.ఒకవేళ ఎంపిక అయినా ఆస్కార్ కమిటీ సభ్యులని మెప్పించి అవార్డులు సొంతం చేసుకునే సినిమాల జాబితాలో అసలు ఇండియన్ మూవీస్ ఉండవు.
అయితే దీనిని ఇండియన్ ఫిలిం దర్శక, నిర్మాతలు భారతీయ సినిమాపై ఉన్న చిన్న చూపే కారణం అని అంటారు.అయితే ఆస్కార్ అవార్డులు ఇచ్చే సమయంలో చాలా అంశాలు పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుందని, భారతీయ సినిమాలలో ఒక అంశం ఉంటే మరో అంశం మిస్ అవుతుందని ఈ కారణంగానే ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావడం లేదని కొంతమంది క్రిటిక్స్ అంటూ ఉంటారు.
అయితే ఇండియా నుంచి ఆస్కార్ బరిలోకి వెళ్ళే సినిమాలు మాత్రం కొద్దో, గొప్పో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలే ఉంటాయి.తాజాగా ఇండియా నుంచి సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూరారై పొట్రు ఆస్కార్ అవార్డులో బరిలో నిలిచింది.

ఆస్కార్ అవార్డుల జనరల్ కేటగిరీలో ఈ చిత్రం ఇతర సినిమాలతో పోటీపడనుంది.ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కథా రచయిత తదితర విభాగాల్లో సూర్య సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆస్కార్ అవార్డుల స్క్రీనింగ్ రూమ్ లో సూరారై పొట్రు’ చిత్రం ఇవాళ్టి నుంచి ప్రదర్శనకు అందుబాటులో ఉంటుంది.ఈ సినిమా ఆకాశం నీ హద్దురా టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
సూర్య నటనకి మంచి ప్రశంసలు లభించాయి.ఆస్కార్ బరిలో పోటీ పడుతున్న నేపధ్యంలో చిత్ర సహనిర్మాత రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్ స్పందిస్తూ, ఆస్కార్ జ్యూరీ సభ్యులను తమ చిత్రం మెప్పిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిందని అన్నారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్కార్ నిబంధనలు సడలించడంతో ఓటీటీ వేదికలపై విడుదలైన చిత్రాలను కూడా నామినేషన్లకు అనుమతించారు.
.