తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలహీనం చేయాలి అని విషయం పైనే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దృష్టి పెట్టారు.టిడిపి ప్రాధాన్యం తగ్గించేందుకే జనసేన ను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది.
పోటీ అంతా జనసేన వైసీపీ మధ్య వుండే లో చూసుకుంటోంది.క్రమక్రమంగా టిడిపి ప్రభావం తగ్గించడం ద్వారా, 2024 ఎన్నికల్లో సత్తా చాటుకోవాలి అనేది వైసిపి ప్లాన్ గా కనిపిస్తోంది.
అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, టిడిపిని ఇరుకున పెట్టేలా ముందుకు వెళుతోంది.ఇది ఎలా ఉంటే , గతంతో పోలిస్తే టిడిపి నాయకుల్లో ఉత్సాహం పెరిగింది.
అధినేత చంద్రబాబుతో పాటు , ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యాక్టివ్ అవ్వడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహారాలు చేస్తుండడం వంటివి ఎన్నో ఇటీవల కాలంలో చోటుచేసుకున్నాయి.అయితే టిడిపిని మరింత బలహీనం చేసే క్రమంలో ఆ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలను ,కీలక నాయకులను తమ వైపుకు వచ్చేలా చేసుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల తోపాటు, మరికొందరు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరకుండా , బయట నుంచి మద్దతు పలుకుతున్నారు.జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు.
ఇప్పటికే వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి వాసుపల్లి గణేష్ కుమార్ వంటి వారు టిడిపి కి రాజీనామా చేశారు.అయితే వీరే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులను చేర్చుకుని తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని వైసిపి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత వారు పార్టీ కి రాజీనామా చేసి వైసీపీకి అనుబంధం కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నెలలోనే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టిడిపిని మరింత బలహీనం చేసి ,తమ ఎత్తుగడను అమలు చేయాలనే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది.