తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారించారు .దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన కలుస్తూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కకుండా ఏం చేయాలి అనే విషయంపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తోనూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తోనూ కేసీఆర్ భేటీ అయ్యారు.ఈరోజు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.ఈ సమావేశంలో హేమంత్ సోరెన్ తండ్రి శిభు సోరెన్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే జార్ఖండ్ పర్యటన సందర్భంగా కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది.
రాంచీలో కెసిఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు.
దేశ్ కి నేత కెసిఆర్ అంటూ భారీ ఫ్లెక్సీలు అడుగడుగునా కనిపించాయి.దీంతో కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో ఏ స్థాయిలో ప్రాముఖ్యం దక్కబోతోంది అనే విషయం అర్థం అయిపోయింది.
ఇదే విషయాన్ని తెలంగాణ సీఎంవో నోట్ విడుదల చేసింది.జాతీయ ఫెడరల్ నేతకు జార్ఖండ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు అని సీఎంవో జారీ చేసిన నోట్ లో ఉంది.
ఇక రాంచి లో కేసిఆర్ ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి నివాళులు అర్పించారు.అలాగే దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల ను ఆదుకుంటామని కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ,వారికి తగిన సహాయం అందించారు.
జార్ఖండ్ కు చెందిన అమర జవాన్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున చెక్కులను కేసిఆర్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తో కలిసి అందించారు.మరికొద్ది రోజుల్లోనే అన్ని రాష్ట్రాల్లోని అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.రాంచీ మొత్తం కేసిఆర్ ఫ్లెక్సీలతో నిండిపోయింది.దేశ్ కి నేత కేసిఆర్ అనే బ్యానర్లు భారీ ఎత్తున దర్శనం ఇచ్చాయి.బిజెపికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలతో కెసిఆర్ సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ, జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభిస్తుండడం టిఆర్ఎస్ నేతలకు ఆనందాన్ని కలిగిస్తోంది.