ఒక్కో పరుగు విలువ తెలిస్తే.. అమ్మో అనాల్సిందే..! అలాగే ఒక్కో వికెట్ కి కూడా..!       2018-05-22   23:51:18  IST  Raghu V

IPL ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత‌ కాస్ట్లీ గేమ్.! ఆట‌గాళ్ళ కొనుగోలు ద‌గ్గ‌రి నుండి చీర్ లీడ‌ర్ల డాన్స్ వ‌ర‌కు ప్ర‌తిదీ కాస్టే.! ఇక ఆట‌గాళ్ళు ధ‌రించిన జెర్సీ మొద‌లు….బౌండ‌రీ లైన్స్ మీద రోప్ వ‌ర‌కు ఇంచు కూడా వ‌ద‌ల‌కుండా అడ్వ‌ర్టైజ్ మెంట్లు….టోట‌ల్ గా కోట్ల గేమ్ ఇది.

ఐపీఎల్‌ కప్‌ సాధించాలని ప్రతీ జట్టు యాజమాన్యం కోరుకోవడం సహజం. అందుకే సిక్సర్‌లతో చెలరేగి పరుగుల వరద పారిస్తారనే పేరున్న ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి వేలంలో భారీ మొత్తం చెల్లించి మరీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తాయి. అయితే ఒక్కోసారి ఆ అంచనాలు తలకిందులు కావడం.. బాగా ఆడతారనే నమ్మకంతో కొనుగోలు చేసిన ఆటగాళ్లలో కొందరు రాణించలేకపోవడం.. మరికొందరు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టు కనీసం ప్లే ఆఫ్‌కు చేరుకోకపోవడం ఫ్రాంచైజీలను నిరాశకు గురిచేసింది. అలా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు తమ జట్టుకు ఎంతవరకు న్యాయం చేశారో.. ఒక్కో పరుగుకు, వికెట్‌కు ఎన్ని లక్షల రూపాయలు సంపాదించారో ఓసారి గమనిద్దాం.

విరాట్‌ కోహ్లి… రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

టీమిండియా కెప్టెన్‌, రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లిని బెంగళూరు యాజమాన్యం 17 కోట్ల రూపాయలు చెల్లించి అంటిపెట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది అత్యధి​క ధర. 14 ఇన్నింగ్స్‌లో 48.18 సగటుతో 530 పరుగులు చేసిన కోహ్లి తన విలువకు తగ్గట్టుగా రాణించాడు కానీ తన జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చలేక పోయాడు. కోహ్లి చేసిన ఒక్కో పరుగు విలువ 3.20 లక్షలు.

-

రోహిత్‌ శర్మ.. ముంబై ఇండియన్స్‌

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగిన ఈ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ జట్టును కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేర్చలేకపోయాడు. 14 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 286 పరుగులు మాత్రమే చేసిన రోహిత్‌ అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. దీంతో 15 కోట్ల రూపాయలకు రోహిత్‌ను రీటేన్‌ చేసుకున్న ముంబై జట్టు ఒక్కో పరుగుకు 5.24 లక్షల రూపాయలు చెల్లించినట్లయింది.

-

బెన్‌స్టోక్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌

2017 ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక ధర(14. 50 కోట్లు)కు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు ఈ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌. రైజింగ్‌ పుణె సూపర్‌ జాయింట్‌ ఫ్రాంచైజీ తొలగింపుతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ సారి 12.5 కోట్లు వెచ్చించి మరీ స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ జట్టులో అత్యధిక ధర కలిగిన ఆటగాడు కూడా ఇతడే. అయితే 13 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్‌ కేవలం 196 పరుగులు చేసి, 8 వికెట్లు మాత్రమే తీశాడు. అంటే ఒక్కో పరుగుకు 6.37 లక్షలు, ఒక్కో వికెట్‌కు 1.56 కోట్ల రూపాయలు చెల్లించినట్లయింది. ఏదైతేనేమి స్టోక్స్‌ అంతగా రాణించకపోయినప్పటికీ ఆర్‌ఆర్‌ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.

-

హార్ధిక్‌ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ 11 కోట్ల రూపాయలకు రీటేన్‌ చేసుకుంది. అయితే 13 మ్యాచ్‌లాడిన జూనియర్‌ పాండ్యా కేవలం 260 పరుగులకే పరిమితమై.. 18 వికెట్లు తీశాడు. అంటే ఒక్కో పరుగుకు 4. 24 లక్షలు, ఒక్కో వికెట్‌కు 6.11 లక్షల రూపాయలు ఆర్జించాడన్న మాట.

-

రిషభ్‌ పంత్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో (ఇప్పటి వరకు) అత్యధిక పరుగులు(684) చేసిన ఘనత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు రిషభ్‌ పం‍త్‌కే దక్కుతుంది. ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకొన్న ఈ యువ ఆటగాడు అద్భుత ప్రదర్శన కనబరచి ‘స్టార్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా నిలిచాడు. 8 కోట్ల రూపాయలకు పంత్‌ను రీటేన్‌ చేసుకున్న ఢిల్లీ జట్టుకు అతడు న్యాయం చేశాడనే చెప్పాలి. 14 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 52. 61 సగటుతో 684 పరుగులు చేశాడు. అంటే ఒక్కో పరుగుకు పంత్‌ తీసుకున్న మొత్తం 1. 16 లక్షలు అన్నమాట. అయితే డీడీ జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం యాజమాన్యాన్ని నిరాశకు గురిచేసింది.

-

గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ఢిల్లీ జట్టు 9 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. అయితే యాజమాన్యం తన మీద పెట్టుకున్న అంచనాలకనుగుణంగా అతడు రాణించలేకపోయాడు. 12 ఇన్నింగ్స్‌లో 14.08 సగటుతో 169 పరుగులు మాత్రమే చేసిన మాక్స్‌వెల్‌కు ఒక్కో పరుగుకు 5.32 లక్షల భారీ మొత్తం చెల్లించినట్టయింది.

-

జోస్‌ బట్లర్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌

ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను 4.40 కోట్ల రూపాయలు వెచ్చించి రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే ఆరంభంలో మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసిన బట్లర్‌.. పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడైతే ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యాడో అప్పటి నుంచి బ్యాట్‌ ఝులిపించి పరుగుల వరద పారించాడు. 13 ఇన్నింగ్స్‌(ఇప్పటి వరకు)లో ఆడిన బట్లర్‌ 548 పరుగులు చేశాడు. ఇందులో ఐదు వరుస అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఒక్కో పరుగుకు 80 వేల రూపాయలు ఆర్జించిన బట్లర్‌ తన జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించి తన విలువేంటో చాటి చెప్పాడు.

-

ఆండ్రూ టై… కింగ్స్‌ పంజాబ్‌

ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టైని పంజాబ్‌ ఫ్రాంచైజీ 7. 20 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. అందుకు తగ్గట్టుగానే బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ తిప్పలు పెట్టి పర్పుల్‌ క్యాప్‌(ఇప్పటి వరకు) సాధించాడు.14 మ్యాచులాడిన టై 24 వికెట్లు తీసి తన వంతు పాత్ర పోషించాడు. అంటే ఆండ్రూ టై తీసిన ఒక్కో వికెట్‌ విలువ అక్షరాలా ముప్పై లక్షలు.

-

ట్రెంట్‌ బౌల్ట్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

ఈ సీజన్‌లో 18 వికెట్లు తీసిన ఈ కివీస్‌ బౌలర్‌ను ఢిల్టీ జట్టు 2. 20 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అత్యధిక ధరకు అమ్ముడుపోతాడని భావించిన బౌల్ట్‌ సేవలను వినియోగించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో తనను కొనుగోలు చేసిన ఢిల్లీ జట్టు సాధించిన అతి కొద్ది విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన బౌల్ట్‌.. తాను తీసిన ఒక్కో వికెట్‌కు 12. 2 లక్షల రూపాయల చొప్పున ఆర్జించాడన్న మాట.

-

మయాంక్‌ మార్కండే.. ముంబై ఇండియన్స్‌

భారత యువ లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే ముంబై జట్టు తనపై వెచ్చించిన 20 లక్షల రూపాయలకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. టోర్నీ మొత్తంలో 15 వికెట్లు తీసిన మయాంక్‌ ముంబై జట్టులో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. మయాంక్‌ తీసిన ఒక్కో వికెట్‌ విలువ 1. 33 లక్షల రూపాయలు.

-

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.