రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత.! సెల్ఫీ వీడియోలో ఏమన్నారంటే.?     2018-07-20   09:54:54  IST  Sai Mallula

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సింగర్‌ మరియు డబ్బింగ్‌ ఆర్టిస్టు అయిన సునీత గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది. ఆమద్య ఈమె వైవాహిక జీవితం గురించి చాలా కాలం పాటు మీడియాలో చర్చ జరిగింది. భర్తకు ఈమె దూరంగా ఉంటుందని, భర్తతో పడలేక ఈమె అతడిని వదిలేసిందంటూ రక రకాలుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సునీత భర్తను అసమర్ధుడు అంటూ వదిలించుకుందని, ఆయన అనుమానిస్తుండనే ఉద్దేశ్యంతోనే విడిగా ఉంటుందని సునీత గురించి చెడు ప్రచారం వచ్చింది. పిల్లలతో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సునీత గురించి ఆమద్య షాకింగ్‌ పుకార్లు షికార్లు చేశాయి.

సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు గురువారం సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయింది. ఈ వార్తపై ఆమె స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలో ఆమె స్పష్టం చేశారు. ‘మీ అందరి ఆదరణవల్లే ఇంకా పాటలు పాడుతూ.. హాయిగా ఉన్నాను. కానీ, అనుకోకుండా ఒక వార్త నన్ను కలవర పెట్టింద’ని అన్నారు. దయచేసి రూమర్లను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు మధ్యాహ్నం వార్తలు ప్రసారం అయ్యాయనీ, వెంటనే వందల కొద్దీ ఫోన్ల వరద మొదలైందని అన్నారు. ‘చాలా సంతోషం . నా మేలు కోరి, నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. కానీ, మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఉంటే తప్పకుండా చెప్తాన’ని అన్నారు. దయచేసి వదంతులను ప్రసారం చేయొద్దని మీడియాను కోరారు.