లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్లు డీయాక్టివేట్‌ అవుతాయా.? వాట్సాప్ లో వైర‌ల్ అవుతున్న ఫేక్ న్యూస్ పై వివ‌ర‌ణ‌.  

మీ ఆధార్ ను మీ మొబైల్‌ నంబర్‌కు లింక్‌ చేయండి.. లేదంటే మీ మొబైల్‌ నంబర్‌ను డీయాక్టివేట్‌ చేస్తారు.. అంటూ ఒకప్పుడు దేశంలో ఉన్న మొబైల్‌ వినియోగదారులకు టెలికాం కంపెనీలు ఊదరగొట్టేలా, విసిగించేలా మెసేజ్‌లు పంపాయి. కాల్స్‌ చేశాయి.. కట్‌ చేస్తే.. అసలు మొబైల్స్‌కు ఆధార్‌ ఎందుకు ? అవసరం లేదు.. అంటూ సుప్రీం కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అయితే ఈ విషయం అటుంచితే.. ఇప్పుడు మొబైల్‌ వినియోగదారులకు మరొక కొత్త సమస్య వచ్చి పడింది. అదేమిటంటే…

SIM Card Deactivation Over Mobile-Aadhaar Linkage-Mobile-aadhaar Linkage Sim Uidai

SIM Card Deactivation Over Mobile-Aadhaar Linkage

గతంలో మొబైల్‌ నంబర్‌ డీయాక్టివేట్‌ కాకుండా ఉండేందుకు ఆధార్‌ను చాలా మంది మొబైల్స్‌కు లింక్‌ చేసుకున్నారు కదా.. అయితే గతంలో అలా మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ను లింక్‌ చేసుకున్న వారి మొబైల్‌ నంబర్లు ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో డీ యాక్టివేట్‌ అవుతాయేమోనని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. మొబైల్ నంబర్లకు ఆధార్‌ అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పుచెప్పింది కదా.. దీంతో ఇప్పటికే లింక్‌ చేసిన వారు తమ ఆధార్‌ను మొబైల్‌కు డీలింక్‌ చేసుకోవాలనే ఓ పుకారు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్లను వెంటనే డీలింక్‌ చేసుకోవాలని కొందరు మెసేజ్‌లను వ్యాప్తి చెందిస్తున్నారు. అలా డీలింక్‌ చేయకపోతే మొబైల్‌ నంబర్లు డీయాక్టివేట్‌ అవుతాయని బెదిరిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు తమ మొబైల్‌ నంబర్లు డీయాక్టివేట్‌ అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

SIM Card Deactivation Over Mobile-Aadhaar Linkage-Mobile-aadhaar Linkage Sim Uidai

అయితే ఆధార్‌-మొబైల్‌ డీలింక్‌ వార్తలు వట్టి పుకార్లేనని అందులో ఎంత మాత్రం నిజం లేదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డాట్‌), యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)లు తాజాగా విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. సుప్రీం కోర్టు కొత్త సిమ్‌లకు మాత్రమే ఆధార్‌ అవసరం లేదని చెప్పిందని ఆ విభాగాలు తెలిపాయి. అంతేకానీ.. ఇప్పటికే ఆధార్‌ను మొబైల్‌కు లింక్‌ చేసిన వారు దాన్ని డీలింక్‌ చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశాయి. అయితే త్వరలో నూతనంగా మొబైల్‌ నంబర్లను తీసుకునే వారి కోసం నూతన వెరిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెడతారట. ఏదైనా ఐడీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌లతోపాటు కస్టమర్‌ స్పాట్‌లో ఉన్న ఫొటో, ఆ లొకేషన్‌ వివరాలను తీసుకుని టెలికాం కంపెనీలు సిమ్‌ కార్డులను ఇచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశ పెడతారట. ఏది ఏమైనా.. ఇలాంటి పుకార్లను మాత్రం మీరు నమ్మకండి. అసలు సోషల్‌ మీడియాలో వచ్చే ఏ మెసేజ్‌నైనా నమ్మే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి మరీ ముందుకు సాగండి..!