మంత్ర శిద్దా కుటుంబంలో ర‌చ్చ ర‌చ్చ‌.. రీజ‌న్ ఇదే!       2018-05-21   21:57:08  IST  Bhanu C

ఏపీ మంత్రి, సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడుగా పేరు పొందిన శిద్దా రాఘ‌వ‌రావు కుటుంబంలో రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైంది. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో కుటుంబం ప‌ద‌వుల క‌ల‌హాల‌తో రోడ్డున ప‌డ‌డం ఆయ‌న‌కు కంటిపై నిద్ర‌లేకుండా చేస్తోంది. ఈ ప‌రిణామంతో ఆయ‌న తీవ్ర క‌ల‌త చెందుతున్నారు. ఈ స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు త‌మను ప‌ట్టించుకోరా? అంటూ మీడియా ముఖంగానే విమ‌ర్శిస్తున్నారు. విష‌యంలోకివెళ్తే.. ఒంగోలు డెయిరీ చైర్మన్‌గా మంత్రి శిద్దా స‌మీప బంధువు.. శిద్దా వెంకటేశ్వరరావు బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

అయితే, వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ ప‌ద‌వి చేప‌డ‌తాడ‌ని మంత్రి శిద్దాకు ఎలాంటి క‌బురూ అంద‌లేదు. ఇదిలావుంటే, శిద్దా వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఈ ప‌ద‌విలో పట్టుమని పది రోజులు కూడా కూర్చోకుండానే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. సీఎం ఓకే అంటేనే చైర్మన్‌గా కొనసాగుతానని వద్దంటే రాజీనామా ఆమోదించాల ని శిద్దా బంతిని సీఎం కోర్టుకు నెట్టారు. ఇక సీఎం నిర్ణయమే తరువాయి. అయితే డెయిరీ విషయం మళ్లీ మాట్లాడదామని చైర్మన్‌ శిద్దాతో చెప్పిన ముఖ్యమంత్రి ఆ తరువాత వీరిని పిలవలేదు.

ఒకటి రెండుమార్లు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, ఇన్‌చార్జ్‌ మంత్రి నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు సమావేశమై డెయిరీ విషయం చర్చించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన సూచన మేరకు తరుపరి నిర్ణయం తీసుకుందామని మంత్రులు శిద్దా,నారాయణ, జనార్దన్‌లు చైర్మన్‌ శిద్దాకు చెప్పారు. నిజానికి మంత్రి శిద్దా రాఘవరావుకు తెలియకుండానే ఆయన సమీప బంధువైన వెంకటేశ్వరరాను రాత్రికి రాత్రే చైర్మన్‌ చేయడం వివాదంగా మారింది.

దీని వెనుక టీడీపీకి చెందిన ముఖ్యనేతతో పాటు మరికొందరు నేతల ప్రమేయమున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మరోవైపు మంత్రి శిద్దా సైతం తనకు తెలియకుండా తన కుటుంబ సభ్యుడిని చైర్మన్‌ చేసి తన కుటుంబంలో విబేధాలు సృష్టించే ప్రయత్నం చేయడంపై ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి పాత, కొత్త చైర్లన్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్ని గొడవల నేపథ్యంలో డెయిరీ కొత్త చైర్మన్‌ విషయం ముఖ్యమంత్రి ఇప్పట్లో తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా వెంకటేశ్వరరావును చైర్మన్‌ గా ముఖ్యమంత్రి ఆమోదించే పరిస్థితి లేదన్నది స్పష్టం. అయిన‌ప్ప‌టికీ.. ఈ విష‌యాన్ని నాన్చ‌డం ద్వారా రాజ‌కీయంగా ల‌బ్ధి చేకూర్చుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం ల‌భిస్తోంది. మ‌రి ఈ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. రెండో వ‌ర్గం తిరుగుబావుటా ఎగుర‌వేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.