ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల కరోనా టీకాలు వికటించడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.
కానీ దీనికి సరైన ఆధారాలను కనుగొనలేదు.కొందరిలో ఇదివరకే ఉన్న వ్యాదుల వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంటుందని మాత్రం వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఇదే సమయంలో ఈ టీకాలు ఎంతవరకు సేఫ్ అనే ఆలోచనలో కూడా కొందరు ఉన్నారట.ఇకపోతే తాజాగా యూకేలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కాగా వీరి మరణం విషయంలో స్పందించిన యూకే ఔషధ నియంత్రణ సంస్థ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టిన సమస్యలతో వారు చనిపోయినట్టు నిర్ధారించింది.
అయితే మార్చి 24వ తేదీ వరకు 1.81 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే, అందులో 30 మందిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తిందని, వారిలో ఏడుగురు మరణించారని మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది.కాగా రక్తం గడ్డ కట్టే సమస్య కరోనా వ్యాక్సిన్ ద్వారా వచ్చిందా లేదా మరేదైనా అనారోగ్య సమస్యలున్నాయా అన్న దానిపై విచారణ జరుగుతున్నట్లుగా వెల్లడించింది.