ఆ వార్తలపై గీత చాలా సీరియస్‌   Serious On Geetha Madhuri Rumours In Telugu Bigg Boss 2     2018-10-16   09:06:53  IST  Ramesh P

ప్రముఖ సింగర్‌, బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 రన్నరప్‌ గీతా మాధురి గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. గీతా మాధురి విషయంలో కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ రచ్చ చేస్తున్నాయి. ఆమె బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్న సమయంలోని కొన్ని సంఘటనలను తీసుకుని వాటిపై కథనాలు అల్లేస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో గీతా మాధురి సీరియస్‌ యాక్షన్‌కు సిద్దం అయ్యింది.

తనకు గత కొన్ని రోజులుగా మనశ్శాంతి లేకుండా చేస్తున్న యూట్యూబ్‌ ఛానెల్స్‌ పై లీగల్‌ చర్యలకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది. తనపై తప్పుడు వార్తలు రాసిన, తప్పుడు వీడియోలు ప్రచురించిన ప్రతి ఒక్కరిపై చర్యలకు తాను రెడీ కాబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే రెండు రోజుల సమయం ఇచ్చి ఆ తర్వాత తన లీగల్‌ చర్యలు తీసుకుంటానంది. ఈ రెండు రోజుల్లో తనపై ఉన్న తప్పుడు కథనాలు మరియు పుకార్లకు సంబంధించిన వీడియోలను తీసేయాలని, ఆ తర్వాత కూడా వీడియోలు అలాగే ఉంటే మాత్రం పోలీసు కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని గీతామాధురి హెచ్చరించింది.

గీతా మాధురి బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న సమయంలో సామ్రాట్‌తో కాస్త ఎక్కువ చనువుగా ఉన్న విషయం తెల్సిందే. దాంతో ఆయనకు ఆమెకు మద్య సంబంధం అంటూ పిచ్చి పుకార్లు మొదలయ్యాయి. సోషల్‌ మీడియాలో మొదలైన ఆ పుకార్లను బేస్‌ చేసుకుని యూట్యూబ్‌ వీడియోలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. గీతా మాధురి విషయంలో ఆమె ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Serious On Geetha Madhuri Rumours In Telugu Bigg Boss 2-

సామ్రాట్‌తో ఈమె ప్రవర్తన, ఇంకా ఇతర ఇంటి సభ్యులతో ఈమె ప్రవర్తించిన తీరు, ప్రతి దానికి ఈమె కాస్త చిన్న పిల్లలా ప్రవర్తించడం వంటి కారణంగా అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయినా కూడా గీతా మాధురిని ఫైనల్‌ వరకు తీసుకు వెళ్లారు. కౌశల్‌ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి ప్రస్తుతం యూట్యూబ్‌ ఛానల్స్‌ కారణంగా తలనొప్పిని ఎదుర్కొంటుంది. ఈ లీగల్‌ చర్యల వల్ల అయినా ఆమెపై పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పడుతుందేమో చూడాలి.