ఇకపై ఆ బీచ్ దగ్గర సెల్ఫీ దిగడానికి వీళ్లేదు..! ఫైన్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.!       2018-06-29   01:33:38  IST  Raghu V

సెల్ ఫోన్ ఉంటే చాలు ఇల్లు,గుడి ,బడి,రోడ్డు..ఇలా ఎక్కడ నిలబడితే అక్కడ సెల్ఫీ దిగడమే..పక్కన ఏం జరుగుతుంది..పక్కనుండి ఎవరెళ్తున్నారు ఏవి పట్టించుకోకుండా లోకాన్నే మర్చిపోతున్నారు.చిన్నాపెద్దా తేడాలేకుండా ఫోన్ మాయలో ,ఫోటోల మాయలో మునిగిపోతున్నారు. ఇక బీచ్ కనిపిస్తే ఫోటోలకు కరువే ఉండదు అనుకుంట. రకరకాల ఫోజులిచ్చి ఫోటోలు దిగేస్తుంటారు. కాకపోతే ఇకపై అలా కుదరదంట. ఎందుకో తెలుసా.? వివరాలు మీరే చూడండి!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దిఘా పట్టణంలోని ప్రసిద్ధ బీచ్‌ను ‘నో సెల్ఫీ జోన్’గా జిల్లా పోలీసులు ప్రకటించారు. దిఘా బీచ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సముద్ర అలలతో నెలరోజుల్లో 8 మంది పర్యాటకులు మృత్యువాత పడిన నేపథ్యంలో పోలీసులు ఈ బీచ్ లో సెల్ఫీలపై నిషేధం విధించారు. దిఘా బీచ్ లో సముద్రంలోకి పర్యాటకులు వెళ్లకుండా పసుపు రంగు తాడును అడ్డుగా కట్టి నిరోధిస్తున్నామని మిడ్నాపూర్ జిల్లా అదనపు ఎస్పీ ఇంద్రజిత్ బసు చెప్పారు. తమ పోలీసులతోపాటు వాలంటీర్లు, విపత్తు నిర్వహణ సంస్థ బృందాలను ఈ బీచ్ లో మోహరించి పర్యాటకుల భద్రతకు చర్యలు తీసుకున్నట్లు ఇంద్రజిత్ బసు పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా పర్యాటకులు బీచ్ లో సెల్ఫీ దిగేందుకు యత్నిస్తే వారిని అరెస్టు చేశామని ఇంద్రజిత్ హెచ్చరించారు.

అలాంటివారిపై ఐపీసీ 290 పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టడంతోపాటు రూ.200 జరిమానా విధిస్తామని ఇంద్రిజిత్ చెప్పారు. ఈ బీచ్ తీరప్రాంతంలో నిఘా కోసం వాచ్ టవర్లను నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే అఖిల్ గిరి చెప్పారు. సెల్ఫీ నిషేధాన్ని ఉల్లంఘించిన 25 మందిని అరెస్టు చేశామని మిడ్నాపూర్ పోలీసులు వివరించారు.