సెల్ఫీ రాజా రివ్యూ   Selfie Raja Movie Review     2016-07-15   03:29:49  IST  Raghu V

చిత్రం : సెల్ఫీ రాజా

బ్యానర్ : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, గోపి ఆర్ట్స్

దర్శకత్వం : జి.ఈశ్వర్ రెడ్డి

నిర్మాత : రామబ్రహ్మం సుంకర

సంగీతం : సాయికార్తిక్

విడుదల తేది : జలై 15, 2016

నటీనటులు : అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్న రనావత్, పృధ్వీరాజ్, రవిబాబు

అల్లరి నరేష్ – ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఇంతకుముందు “జెమ్స్ బాండ్ – నేను కాదు నా పెళ్ళాం” అనే హిట్ సినిమా వచ్చింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సొంత సంస్థ అన్న విషయం తెలిసిందే. మరి వీరి కాంబినేషన్ లోని మలిప్రయత్నం ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళ్తే …

సెల్ఫీ రాజా (అల్లరి నరేష్), ఒక సెల్ఫీ పిచ్చోడు. పొద్దున్నే లేస్తే సెల్ఫీ, రాత్రి పడుకునే ముందు సెల్ఫీ, ఏ చిన్న పని చేసిన సెల్ఫీ. తన సెల్ఫీ పిచ్చి వల్ల తాను ఇబ్బందుల్లో పడుతూ, ఇతరులని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉంటాడు. పోలిస్ కమిషనర్ కూతురు శ్వేత (కామ్న రనావత్) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు రాజా. వారి కాపురంలో ఓ వ్యక్తి చిచ్చు పెట్టడంతో శ్వేత రాజాని వదిలేసి వెళ్ళిపోతుంది. భార్య లేక బ్రతకలేనని, తనను చంపడానికి తానే ఓ సిరియల్ కిల్లర్ కి(రవిబాబు) డబ్బులు ఇస్తాడు రాజా.

విచిత్రంగా రాజాని పోలిన మరో కిల్లర్ భీమ్స్ (అల్లరి నరేష్) తో కలిసి, రాజాని చంపి అతని ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు రవిబాబు. ఇంతలోనే రాజా-శ్వేత కలిసిపోతారు. దాంతో రాజా చచ్చిపోయే ఆలోచన వదిలేసినా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సిరియల్ కిల్లర్ గ్యాంగ్, పాత పగతో పోలీస్ కమిషనర్ ఫ్యామిలిని చంపాలని తిరిగే ఓ రౌడి గ్యాంగ్, సెల్ఫీ రాజా వలన భర్తను కోల్పోయిన ఇద్దరు లేడి రౌడిలు … ఇలా అందరు సెల్ఫీ రాజాని చంపడానికి తిరుగుతూ ఉంటారు.

సెల్ఫీ రాజా వారి చేతికి చిక్కాడా లేదా అనేది మిగితా కథ.

నటీనటుల నటన గురించి

అల్లరి నరేష్ షరామామూలే. తనదైన శైలిలో కామెడి టైమింగ్ తో సినిమా మొత్తం నడిపించాడు. ప్రత్యేకంగా తన నటన గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమి లేదు. ఇప్పటికి ఎన్నో సినిమాల్లో చూసిన నటనే ఇందులో కూడా ఉంది. ఇక హీరోయిన్లు కామ్నా రనావత్, సాక్షి చౌదరి, పాటల్లో అందాల ఆరబోతకి పనికొచ్చారు అంతే. కామ్నా హావభావాలు పక్కనపెడితే, డైలాగుల్లో లిప్ సింక్ కూడా లేకపోవడం విడ్డూరం.

రవిబాబు నవ్విస్తాడు. సిల్లి సిరియల్ కిల్లర్ గా మెప్పిస్తాడు. సప్తగిరి కూడా నవ్విస్తాడు. కృష్ణభగవాన్ చాలారోజుల తరువాత మంచి కామెడి క్యారక్టర్ చేసాడు. కామెడియన్ పృథ్వీరాజ్ మళ్ళీ మెరిసిపోయాడు. తనకు మాత్రమే సాధ్యపడే కామిక్ హీరోయిజమ్ తో మంచి టైమ్ పాస్ అందిస్తాడు. మిగితా పాత్రధారుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు.

సాంకేతికవర్గం పనితీరు

ప్రొడక్షన్ వాల్యుస్ బాగాలేవు. కాని ఈ సినిమాకి, ఇంత చిన్న కథకి ఆ అవసరం కూడా లేదు. ఎడిటింగ్ పదునుగా లేదు. అయినా, అల్లరి నరేష్ సినిమాల్లో ఇలాంటి విషయాలు ఎవరు పట్టించుకోరు కూడా. సాయి కార్తిక్ సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫి అంతంతమాత్రమే. పాము కోసం చేసిన సీజి వర్క్ చిన్నపిల్లలు చేసినట్టుగా ఉంది.

విశ్లేషణ :

సెల్ఫీ రాజా అనే టైటిల్ వలన ఆద్యంతం ఒక సెల్ఫీ ని పాయింట్ చేసుకోని కథ నడిపిస్తారేమో అని ఊహించుకుంటాడు ప్రేక్షకుడు. కాని ఇక్కడ అలాంటిదేమి లేదు. కథానాయకుడు చిక్కుల్లో పడటానికి ఒక్క సెల్ఫీ అయినా ప్రేక్షకుల మెదడులో రిజిస్టర్ చేయిస్తే పెట్టిన టైటిల్ కి విలువ ఉండేది. సరే, సెల్ఫీల పిచ్చి వల్లే కథానాయకుడు చిక్కుల్లో పడతాడు అది వేరే విషయం.

దురదృష్టవశాత్తు కామెడి చేయగల హీరోయిన్లు తెలుగు వాళ్ళకి దొరకట్లేదు. ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఒక్క సీన్లో అయినా బొమ్మలాగా కాకుండా, నటిలా ప్రవర్తిస్తారేమో అని ఆశించడం అత్యాశే.

కొన్ని సీన్లు నవ్విస్తాయి. కొన్ని సీన్లు విసుగు పుట్టిస్తాయి. ముఖ్యంగా షకలక శంకర్ మీద తీసిన స్నేక్ కామెడి అస్సలు పేలలేదు. ఎప్పటిలాగే కామెడియన్ పృధ్వీరాజ్ ఓ ఉపశమనం.

ఇక అల్లరి నరేష్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చేయడం మానేస్తే బాగుంటుందేమో. వారిని అనుకరించే కామెడి రాను రాను “అతిగా” మారుతోంది. సినిమా ఫస్టాఫ్ లో ఉన్న పంచ్, సెకండాఫ్ లో లేదు.

మొత్తం మీద, మీ బుర్రను కాసేపు పూర్తిగా పక్కన పెట్టి అక్కడక్కడ నవ్వుకోవాలనుకుంటే, సెల్ఫీ రాజా చూడొచ్చు.

హైలైట్స్ :

* అల్లరి నరేష్,

* కామెడియన్ బ్యాచ్

* డైలాగులు

డ్రాబ్యాక్స్ :

* హీరోయిన్లు

* అనవసరపు సన్నివేశాలు

* సెకండాఫ్

* నిర్మాణ విలువలు

చివరగా :

లాజిక్ పక్కనపెట్టి, అక్కడక్కడ నవ్వుకోవాలంటే ఓ రౌండ్ వేయండి.

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.25/5

,