మన తొలి పండుగ ఉగాది విశిష్టత ఏమిటో తెలుసా?  

ప్రళయం తర్వాత తిరిగి బ్రహ్మ సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ప్రతి బ్రహ్మ కల్పంలో ప్రారంభంలో యుగం ప్రారంభ సమయాన్ని ఉగాది అని పిలుస్తారు. ఉగాది చైత్ర మాసంలో రావటం వలన దీనిని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా సూచిస్తారు. ఈ పండుగను తెలుగు వారు చాలా ఘనంగా జరుపుకుంటారు.

ఉగాది రోజున వేకువ జామున బ్రహ్మ ముహూర్తంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకొని, తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని, మామిడి తోరణాలు కట్టుకొని, గడపకు పసుపు రాసి, బొట్టు పెట్టి పూజకు కావల్సినవి సిద్ధం చేసుకోవాలి.

తులసికోటకు పూజ చేయాలి. ఉగాది రోజున ఇష్టదైవాన్ని పూజించి ప్రత్యేక ప్రసాదం ఆరు రుచులు కలిగిన అంటే పులుపు, చేదు, తీపి, ఉప్పు, కారం, వగరుతో ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యం పెట్టాలి. అలాగే ఆ రోజు పంచాంగ శ్రవణం చేసి మీ రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ తర్వాత గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి.

ప్రతి ఒక్కరు ఉగాది నుండి జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. ఉగాది రోజు చేసుకొనే ఉగాది పచ్చడిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రరుచులు మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తాయి.అవి ఎలా అంటే….

బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
ఉప్పు – జీవితంలో ఉత్సాహానికి సంకేతం
వేప పువ్వు – చేదు – బాధకు సంకేతం
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త కొత్త సవాళ్లు
కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.